(జనంసాక్షి) నల్గొండ: పదవులు కాదు ప్రజలే ముఖ్యమని పదవిని త్యాగం చేసిన వ్యక్తి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్గొండలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… కిరణ్, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ఏర్పాటులో సోనియా వెనక్కి తగ్గలేదని తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సోనియా దేవత అని.. కాంగ్రెస్‌తోనే తెలంగాణ సాధ్యమైందని స్పష్టం చేశారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌కు ఇబ్బందని తెలిసినా వాగ్ధానం మేరకు సోనియా తెలంగాణ ఇచ్చారని వెల్లడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కిరణ్‌కుమార్ రెడ్డి అణచివేయాలని చూశారని.. అయినా ఉద్యమంలో వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. సోనియా, రాహుల్‌కు పదవులపై ఆశ లేదని.. రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ తిరస్కరించారని తెలిపారు. తెలంగాణ తెచ్చేది..ఇచ్చేది మేమే అన్నాం..ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ సాధించామని వివరించారు. తెలంగాణను కాంగ్రెస్ నేతలే పోరాడి సాధించారని స్పష్టం చేశారు.




