
(జనంసాక్షి) : చిట్టీల పేరుతో ఏడు కోట్ల రూపాయల మేరకు తోటి కళాకారులను, స్థానికులను ముంచి టీవి ఆర్టిస్టు విజయరాణి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. సిసీఎస్ పోలీసులు విజయారాణి ని అదుపులోకి తీసుకున్నారు. నెల రోజులుగా ఆమె తప్పించుకుని తిరుగుతున్నారు. ఆమెతో పాటు మరో పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు టీవీ నటి విజయరాణి రూ. 7 కోట్ల మోసానికి పాల్పడింది. చిట్టీల పేరుతో విజయరాణి జూనియర్ ఆర్టిస్టుల దగ్గర భారీ మొత్తం డబ్బు వసూలు చేస్తూ వస్తోంది. కొన్నేళ్లుగా నమ్మకంగా చిట్టీలు నిర్వహిస్తుండటంతో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు ఆమె వద్ద డబ్బు పోగేసుకుంటున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా తన వద్ద జమైన రూ. 7 కోట్ల డబ్బుతో విజయరాణి ఉడాయించింది. మరికొందరు ఈ డబ్బు రూ. 10 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. విజయరాణి ఆచూకీ లేక పోవడంతో తాము మోసపోయామని గ్రహించిన జూనియర్ ఆర్టిస్టులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. రాత్రింభవళ్లు కష్టపడి పిల్లల భవిష్యత్ కోసం చిట్టీలు వేస్తున్నామని, విజయరాణి ఇలా మోసం చేస్తుందని ఊహించలేదని బాధితులు గగ్గోలు పెట్టారు. విజయరాణి సామాన్లు కూడా తీసుకుని లారీలో పారిపోయినట్లు భావించారు. ఆమె బ్యాంక్ ఖాతాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.




