సంగారెడ్డి, ఏప్రిల్ 9 : కారు గుర్తుతో పార్టీ నడిపిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సొంత కారు లేదంటే ఎవరైనా నమ్ముతారా! కానీ ఆయన ఎన్నికల అఫిడవిట్ సాక్షిగా నమ్మాల్సిన నిజం ఇది. అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.. తన పేరిట రూ.9.90లక్షలు, తన భార్య పేరిట రూ.1.50లక్షలు నగదు, తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.55 లక్షల పెట్టుబుడులు, తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.4.16 కోట్ల పెట్టుబడులు, హిమాంశు మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.లక్ష షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. మరో కోటి రూపాయలను ఇతరులకు రుణాలుగా ఇచ్చానని తెలిపారు. రూ.21.30 లక్షల విలువైన 710 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయని పేర్కొన్నారు. ఎర్రవల్లిలో 37 ఎకరాల 70 గుంటల భూమి ఉందని, దాని విలువ రూ.91.78 లక్షలని పేర్కొన్నారు. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.4.50 కోట్లని తెలిపారు. మిట్టపల్లిలో 2 ఎకరాల 4 గుంటల భూమి ఉందని, దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.50 లక్షలుగా ఉందని పేర్కొన్నారు. బంజారాహిల్స్ లో ఒక నివాస భవనం, కరీంనగర్ జిల్లా తీగలగుట్ట పల్లిలో నివాసభవనం ఉన్నాయని, వీటి విలువ రూ.3.65 కోట్లని కేసీఆర్ పేర్కొన్నారు. కాగా, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న అప్పులు రూ.7.87 కోట్లు వరకు ఉందని పేర్కొన్నారు. 2012-13లో తన వార్షికాదాయం రూ.6.59 లక్షలుగా నివేదించారు.
నరేంద్రనాథ్ ఆస్తుల విలువ రూ.21.30కోట్లు: మెదక్ లోక్‌సభ బీజేపి అభ్యర్థి నరేంద్రనాథ్ తన ఆస్తుల విలువ రూ.21.30 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. కాగా, రూ.8.82 కోట్ల అప్పులున్నట్లు తెలిపారు.
శ్రవణ్‌కుమార్‌రెడ్డి ఆస్తులు రూ.8కోట్లు: మెదక్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ శ్రవణ్‌కుమార్ రెడ్డి ఆస్తుల విలువ రూ.8 కోట్లగా ఎన్నికల ఆఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో చరాస్తుల విలువ రూ.3కోట్లుగాను, స్థిరాస్తుల విలువ రూ.5కోట్లు.




