
హైదరాబాద్, మే 12 : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. తమ స్టార్ క్యాంపెయినర్ సాధారణ కార్యకర్తేనని ఆయన అన్నారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత మొదటిసారి వచ్చిన ఎన్నికల్లో తాము ఆశించినట్టుగానే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసిస్తూ, కాంగ్రెస్ వెంట ఉన్నారనడానికి ఈరోజు వెలువడిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు. తెలంగాణలో 23 మునిసిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు పొన్నాల లక్ష్మయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.
పదేళ్ళలో కంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్ పనితీరును తెలంగాణ ప్రజలు గుర్తించి, ఈ తీర్పు ఇచ్చారని పొన్నాల పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని ఆయన అన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని పొన్నాల ఆశాభావం వ్యక్తం చేశారు.




