ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ జర్నలిస్టులను ఎటువంటి కారణం చూపకుండా పాకిస్తాన్ ప్రభుత్వం పరోక్షంగా బహిష్కరించింది.ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పిటిఐ) ప్రతినిధి స్నేహేష్ అలెక్స్ ఫిలిప్, హిందూ ఆంగ్ల దినపత్రికకు చెందిన మీనా మీనన్ ఇస్లామాబాద్‌కు వచ్చి తొమ్మిది నెలలు మాత్రమే అయినప్పటికీ వారి వీసాల గడువును పొడిగించడం లేదంటూ మంగళవారం రాత్రి పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి వారికి లేఖలు అందాయి. దీనిపై పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతామని భారత ప్రభుత్వం బుధవారం తెలిపింది.కాగా, ఈ పరిణామం గురించి ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ప్రభుత్వం కాని ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కాని తమకు తెలియచేయలేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. మే 20వ తేదీలోగా దేశాన్ని విడిచిపెట్టాలని ఆ ఇద్దరు జర్నలిస్టులను ఆదేశించిన పాకిస్తాన్ ప్రభుత్వం కారణం మాత్రం తెలియచేయలేదని మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Related