Tuesday, 3 November 2026

ఘనంగా తెలంగాణ ఇంజనీర్స్ డే వేడుకలు

హైదరాబాద్: ఎర్రమంజిల్‌లోని జలసౌధలో తెలంగాణ ఇంజనీర్స్ డే వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్ రాజ్యాన్ని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సస్యశ్యామలం చేసిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

నవాబ్ అలీ జంగ్ రూపకల్పన చేసిన సాగునీటి ప్రణాళికలు:
నవాబ్ అలీ జంగ్ హైదరాబాద్ రాజ్యంలో ఎన్నో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను రూపకల్పన చేశారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, పోచారం ప్రాజెక్టు, నిజాంసాగర్, వైరా, డిండి, కడెం, నాగార్జునసాగర్, పోచంపాడు తదితర ప్రాజెక్టులకు జంగ్ రూపకల్పన చేశారు. అదేవిధంగా ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల భవనం, ఉస్మానియా ఆసుపత్రి, జూబ్లీహాల్, నిజాం షుగర్ ఫ్యాక్టరీల రూపశిల్పి నవాజ్ జంగ్.

జవాబ్‌జంగ్ సేవలను గుర్తించిన రాష్ట్రంప్రభుత్వం ఇకనుంచి ప్రతిఏటా జూలై 11న తెలంగాణ ఇంజనీర్స్ డే గా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు ఆర్. విద్యాసాగర్‌రావు, కేవీ రమణాచారి, ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆర్. విద్యాసాగర్‌రావును మంత్రి హరీశ్‌రావు సన్మానించారు. అదేవిధంగా మంత్రిని ఇంజనీర్లు సన్మానించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *