80 ఫీట్ల రోడ్డు విస్తరణ చేపట్టాలి
మోత్కూరు డిసెంబర్ జనంసాక్షి : మోత్కూరు పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న గృహ, వాణిజ్య సముదాయముల యజమానుల సమావేశము బుధవారం స్థానిక యుటిఎఫ్ భవన్ లో జరిగింది. ఇట్టి సమావేశంలో దాదాపు 117 మంది గృహ యజమానులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలో ప్రధాన రహదారి వెడల్పు పైన అందరూ తమ తమ అభిప్రాయాలను తెలిపారు. ప్రధాన రహదారి వెంట ఉన్న గృహ యజమానుల అభిప్రాయము తీసుకోకుండానే మూడు రోజులలో 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు అనుగుణంగా తమ గృహాలను తొలగించుకోవాలని నోటీసులు ఇవ్వడం పట్ల తమ తీవ్ర అసంతృప్తిని, నిరసనను వ్యక్తపరిచారు. రోడ్డు వెడల్పును డ్రైనేజీ, డివైడర్ స్థలాన్ని కలుపుకొని 80 ఫీట్ల రోడ్డు విస్తరణ మాత్రమే చేపట్టాలని , అదేవిధంగా పూర్తిగా కానీ, పాక్షికంగా గాని ఇండ్లు కోల్పోయిన యజమానులకు టిపిఓ లెక్కల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా పాత బస్టాండు పరిధిలోని వారికి తీవ్ర నష్టం ఏర్పడుతున్నందున, వారంతా పేదలైనందున అట్టివారికి ప్రభుత్వం విధిగా నష్టపరిహారాన్ని పూర్తిస్థాయిలో చెల్లించిన తర్వాతనే రోడ్డు వెడల్పు పనులు మునిసిపల్ వారు చేపట్టాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో అవిశెట్టి అవిలిమల్లు, తీపి రెడ్డి సోమిరెడ్డి, రాజ వీరయ్య,పి. లక్ష్మీనరసయ్య,బి.విశ్వనాథం, మహమ్మద్ అలీ,మరాటి అంజయ్య,వినోద్ రెడ్డి, జనార్ధన్,సుబ్రహ్మణ్యం శర్మ,ఎం.సోమయ్య, వారాల యాదగిరి,బి.శేఖర్,కే.జహంగీర్, కే.నరేందర్,ఏ.ముత్యాలు,శ్రీనివాసు,లింగయ్య, బి అంజయ్య,ఎల్ల భారతమ్మ,రమేష్,వి.స్రవంతి తదితరులు పాల్గొన్నారు.




