Tuesday, 3 November 2026

తెలంగాణ అధికారాలు హరించం

తెరాస ఎంపీలతో రాజ్‌నాథ్
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర అధికారాలు కేంద్రం హరించబోదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ చెప్పారని టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. తెరాస పార్టీ పార్లమెంటరీ నేత  కే కేశవరావు నేతృత్వంలో ఎనిమిది మంది ఎంపీలు, ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం అయ్యారు. 28 రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణకు అన్ని అధికారాలు ఉంటాయని రాజ్‌నాథ్ తమకు చెప్పారని తెరాస పార్లమెంట్ సభ్యులు ఆయనతో భేటీ తర్వాత మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ తర్వాత టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రమంత్రితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు అప్పగించడం అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు హరించడమేనని తెరాస ఎంపీలు, రాజ్‌నాథ్ దృష్టికి తెచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.2014 పునర్విభజన చట్టానికి అనుగుణంగా హైదరాబాద్‌పై గవర్నర్‌కు ఇచ్చిన అధికారాలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు   రాజ్‌నాథ్‌కు నివేదిక అంద చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌పై అధికారాలను గవర్నర్‌కు కట్టపెడుతూ 12 అంశాల మేరకు బిజినెస్ రూల్స్ ప్రకారం మార్పులు చేసుకోవచ్చని కేంద్ర హోంశాఖ ఆదేశిస్తూ సర్కులర్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే తెలంగాణ ప్రభుత్వం ఆ సర్కులర్‌ను తిప్పికొట్టింది. సెక్షన్ 8లో ఉన్న విధంగా 12 అంశాలు, పూర్తి అధికారాలు గవర్నర్‌కు కట్టబెట్టడం అంటే రాష్ట్ర అధికారాలను పరోక్షంగా గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడమే అని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ప్రభుత్వం తెలిపింది. ఎక్కడైనా మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్ ప్రవర్తించాలని, ఆయనకంటూ ప్రత్యేక అధికారులు ఉండవని పేర్కొంది.సెక్షన్ 8ను తాము అంగీకరిస్తున్నామని, అయితే సెక్షన్ 8లో పేర్కొన్న విధంగా 12 అంశాలు లేవని, వాటిలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సర్కార్ తెలిపింది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఎంపీలు కేకేతో పాటు జితేందర్‌రెడ్డి, వివేక్, బీవీ పాటిల్, కవిత, బాల్కాసుమన్, విశ్వేశ్వర్‌రెడ్డి, నగేశ్ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *