Monday, 2 November 2026

పాతబస్తీలో మరెన్నో ‘స్నేక్‌ గ్యాంగ్‌’లు

– భూకబ్జాలు,కిరాయి హత్యలు, మామూళ్లు వసూలు వీరి పనులు
– పట్టించుకోని పోలీసులు
– ఫిర్యాదులిచ్చినా చెత్తబుట్టలోకే
స్నేక్‌ గ్యాంగ్‌ పట్టుబడిందని ఊపిరి పీల్చుకోకండి. ఈ గ్యాంగ్‌ పనైపోయింది కదా ఇక స్వేచ్ఛగా తిరుగొచ్చుని ఊహించుకోకండి. ఎందుకంటే పాతబస్తీలోని బార్కస్‌, ఎర్రకుంట, షాహీన్‌నగర్‌, హషిమాబాద్‌, జహంగీరాబాద్‌, బండ్లగూడ, సలాల, బాబానగర్‌ ప్రాంతాల్లో తెరచాటున ఇంకా ఎన్నో స్నేక్‌ గ్యాంగ్‌లు పనిచేస్తున్నాయి. అయితే ప్రతీ గ్యాంగ్‌ మెడలో పాములు వేసుకుని నేరాలు చేయదు. కొన్ని గ్యాంగులు భూ కబ్జాలకు పాల్పడితే, మరి కంత మంది డబ్బుల పుచ్చుకుని కిరాయి హత్యలు చేస్తుంటాయి. తమకు తాము పెద్ద రౌడీలుగా చెలామణి అయ్యేందుకు తమకు ఎదురు తిరిగిన వాడ్ని కాళ్లు చేతులు విరగ్గొడుతుంటారు. ఇంటి ముందు పార్క్‌చేసిన వాహనాలను ఎత్తుకెళుతుంటారు. దారిన పోయే మహిళల్ని పరుషపదజాలంతో దూషిస్తుంటారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. గ్యాంగుల విషయం బస్తీ వాసులకు తెలిసినా నోరు విప్పరు. తెలిసిన ఈ విషయాలను ఎవరితోనైనా చెబితే అంతే సంగతులు. ఆ గ్యాంగు వాడి శాల్తీ లేపేస్తాయి. తప్పించుకుని తిరిగితే మరీ రెక్కీ నిర్వహించి ఎక్కడ దొరికితే అక్కడే పట్టుకుని చితక్కొడుతారు. వీడి వల్ల ఎప్పటికైనా ప్రమాదమే అనిపిస్తే అతన్ని లేపేస్తాయి.
ఇలాంటి భయంతోనే బస్తీ ప్రజలు రౌడీ గ్యాంగ్‌ల గురించి ఎవరితోనూ చెప్పుకోరు. తమకు సంబంధించిన భూమిని కబ్జా చేసినా ఎదిరించరు, షాపు ముందు నిలబడి నెలసరి మామూళ్లు వసూళ్లు అడిగిన వెంటనే ఇచ్చేస్తుంటారు. తమ ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు రౌడీగ్యాంగులు ఎత్తుకెళ్లినా ఎదిరించరు. ఎందుకంటే శాశ్వతంగా ఈ బస్తీల్లోనే జీవనం కొనసాగించాలనుకుంటే నోరు తెరవకుండా తమ పనేదే చేసుకుంటూ రౌడీ గ్యాంగులు సృష్టిస్తున్న అరాచకాలను చూస్తూ ఊర్కోవాల్సిందే. ఇన్ని విషయాలు చెబుతున్నారు మరి రౌడీ గ్యాంగుల సంగతి పోలీసులకు తెలియదనుకోకండి. తెలిసినా వారు అంతగా పట్టించుకోరు. ఎందుకంటే వారికి ప్రతి నెలా కట్న కానుకలు అందుతుంటాయి. ఈ కారణంగానే బాధితులు వచ్చి ఫిర్యాదు చేసినా అంతగా పట్టించుకోరు. ఎవరైనా గట్టిగా నిలదీసినప్పుడు స్పందిస్తారు. తెల్లకాగితం ఇచ్చి కంప్లైంట్‌ రాయండని చెబుతారు, ఫిర్యాదు దారుడి కోపాన్ని చల్లార్చేందుకు సదరు పోలీసు అధికారులు నాటకాలాడుతారు. ఆ రౌడీ గ్యాంగును పట్టుకురండని కింది స్థాయి పోలీసుల్ని ఆదేశిస్తారు. మీరు వెళ్లండి ఆ గ్యాంగును జైలుకు పంపిస్తామంటూ నమ్మించి పంపిస్తారు. అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లరూ, ఒకవేళ వెళ్లినా రౌడీ గ్యాంగ్‌ స్టేషన్‌కు రాదు, ఫోన్‌లోనే పోలీసు అధికారితో మాట్లాడుతారు. అంతే తమకు అందిన ఫిర్యాదు చెత్తబుట్టలో ఉంటుంది.దొరికితె దొంగ లేకపోతే దొర అన్న చందంగా పోలీసు వ్యవస్థ కూడా తోడవడంతో పై బస్తీల్లో రౌడీ గ్యాంగులు, స్నేక్‌ గ్యాంగ్‌ల ఆకృత్యాలు పెట్రేగిపోతున్నాయి.
రౌడీ గ్యాంగులంటే పోలీసులకు భయం ?
పోలీసులను చూసినా, పెట్రోలింగ్‌ జీప్‌ కనిపించినా దొంగలు, రౌడీగ్యాంగులు, గూండాలు (పహెల్వాన్ల ముసుగులో చెలామణి అవుతున్న వారు) భూ బకాసురులు పారిపోతారన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ పాతబస్తీ, శివారు ప్రాంతాల్లోని పోలీస్‌ స్టేషన్లకు చెందిన పోలీసుల విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగ ఉంటుంది. ఈ గ్యాంగులను చూసి పోలీసులే భయపడుతుంటారు. ఎందుకంటే వారు ఎక్కడ దాడిచేస్తారోనన్న భయం ఒక కారణమైతే మామూలు సమయాల్లో ఆ గ్యాంగులు సమర్పించుకునే నగదు, బంగారు ఆభరణాల మమకారం అడ్డొచ్చి భయపడుతారు. అంతే కాదు తమను నడి బజార్లో పట్టుకుని ఈ రౌడీగ్యాంగు ఎక్కడ పరువు తీస్తోందన్న భయంతో వారి దరిదాపుల్లోకి వెళ్లరు. జిమ్‌కు వెళ్లి కండలు పెంచుకునే యువకులు తమకు తాముగా పహెల్వాన్లుగా చెలామణి అవుతుంటారు.
క్రమంగా మిత్రులతో కలిసి గ్యాంగ్‌ మేయింటేన్‌ చేస్తుంటారు. ఓపెన్‌టాప్‌ జీప్‌లో బస్తీల్లో తిరుగుతుంటారు. దారిన పోయే వారిని బెదిరించి డబ్బులు లాక్కుని కొట్టి పంపిస్తారు, ఆ డబ్బుతో మందు బాటిళ్లు, సిగరెట్లు, గుట్కాలు తెచ్చి తింటారు. ఈ విధంగా ఈ గ్యాంగ్‌ పేరు బస్తీల్లో ఫేమస్‌ అవుతుంది. ఈ అవకాశం కోసమే ఎదురుచూసే గ్యాంగులు పహెల్వాన్‌గా అవతారం ఎత్తుతాడు. అక్కడి నుంచే అతని నేర సామ్రాజ్యం ప్రారంభమవుతోంది. కోళ్లు, మేకలు, పశవులు కనిపించినా వదిలిపెట్టరు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలూ గద్దల్లాగా వాలిపోతుంటారు. నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి కబ్జాలకు పాల్పడుతుంటారు. స్థలం తనదంటూ వచ్చిన వారిపై దాడిచేసి కొట్టి పంపిస్తారు. ఇద్దరి మధ్య తగాదా పెట్టి వీళ్లే సెటిల్మెంట్లు చేస్తుంటారు. ఒంటరిగా రోడ్డుపై వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి అత్యాచారాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి గ్యాంగులపై పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయరు. సాహసం చేసి ఎవరైన ఫిర్యాదు చేస్తే పోలీసులు మాత్రం కేసులు నమోదు చేయరు. ప్రజల పక్షాన నిలబడే నిజాయితీ గల పోలీసు అధికారి ఎవరైనా రౌడీ గ్యాంగులపై కేసు నమోదు చేస్తే అంతే సంగతులు. తమపైనే కేసులు నమోదు చేస్తారా అంటూ స్టేషన్‌లో పోలీసులపై దౌర్జన్యం చేస్తారు. తామంటే పోలీసులు భయపడాలని స్టేషన్‌లో ఉండే టైప్‌ మిషిన్లు, కంప్యూటర్లు పగులగొడుతారు. టేబుళ్లు, కుర్చీలను విరగ్గొడుతారు.
ఈ గ్యాంగ్‌లు పోలీసుల్ని ఇంతటితో వదిలిపెట్టరు. సివిల్‌ లేదా హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తారు. చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ బతుకుదెరువు సాగిస్తున్న తమను పోలీసులు అకారణంగా కేసులు పెట్టి పరువుతీస్తున్నారని, డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని పక్షంలో లేనిపోని కేసులు పెట్టి తమను జైలుపాలు చేస్తున్నారంటూ వివిధ న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి నిజాయితీ పరులైన పోలీసు అధికారుల్ని కోర్టుకు ఈడ్చుతున్నారు. రౌడీ గ్యాంగుల విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నీ డ్యూటీ నీవు చెసుకుని వెళ్లిపో అంటూ సలహాలు ఇస్తుంటారు. దీంతో చాలా మంది పోలీసు అధికారులు బదిలీలు చేయించుకుని వేరే పోలీస్‌ స్టేషన్‌కు మారిపోతుంటారు. ఉన్న వాళ్లు మాత్రం ఎవడెటు పోతే తమకేంటి అన్న రీతిలో ఇలాంటి గ్యాంగ్‌స్టర్స్‌పై కేసులు నమోదు చేయకుండా వదిలేస్తుంటారు. పోలీసుల్లో, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ఇలాంటి రౌడీగ్యాంగులు కనిపించకుండా పోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *