Monday, 2 November 2026

భారీ వ‌ర్షాల కారాణంగా పొంగిన న‌దులు

 

– తెగుతున్న చెరువులు-మునుగుతున్న పంటలు
– నిలిచిపోతున్న రాకపోకలు
– జూరాల గేట్లు ఎత్తివేత
– ‘రంగారెడ్డి’లో ఉప్పొంగుతున్న కాగ్నా
తెలంగాణ వ్యాప్తంగా మూడో రోజూ విస్తారంగా వర్షం కురిసింది. పలు జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. పలుచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. నైరుతి రుతుపనాలు చురుకుగా సాగుతుండటంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రోజు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తివేసి శ్రీశైలం ప్రాజెక్టుకు లక్షా 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో లక్షా 40 క్యూసెక్కులు ఉంది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటి మట్టం
30 అడుగులకు చేరుకుంది. తాలిపేరుకు రోజురోజుకీ వరద ఉధృతి పెరుగుతూనే ఉంది.
మహబూబ్‌నగర్‌ జిల్లా బొంరాన్‌ పేట మండలంలోని మదనపల్లి ఎర్రకుంట చెరువు తెగి ఐదొందల ఎకరాల్లో పత్తి, కంది, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కొడంగల్‌లో కారుపై చెట్టు విరిగి పడగా ఒకరి చెయ్యి విరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడింది. రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్‌, పరిగి, యాలాల మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వికారాబాద్‌లో పది ఇళ్లు దెబ్బతిన్నాయి. శంషాబాద్‌ మండలంలో మూడు గ్రామాలు నీట మునిగాయి. షాబాద్‌ మండలంలో సుమారు 20ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 350 ఎకరాల్లో పంట దెబ్బతింది. తాండూర్‌లోని కాగ్నా నది వరద ఉధృతికి తాండూరు-వికారాబాద్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లక్నాపూర్‌ ప్రాజెక్టు అలుగుపోస్తోంది. ధారూర్‌ పరిధిలోని కత్వ వాగు పొంగి పొర్లుతోంది. కోట్‌పల్లి ప్రాజెక్టులో 15 అడుగుల మేరకు నీరు చేరింది. ఈసి వాగు ఉధృతికి ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా సగటున 32.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. నంగునూరు మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనం కూలిపోయింది. హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.
వరంగల్‌ జిల్లాలో మున్నేరు, జీడి, మోరంచ, చలి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మోరంచ వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా వాజేడు మండలంలో అత్యధికంగా 84 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తాలిపేరు రిజర్వాయర్‌కు వరద ఉధృతి తగ్గలేదు. దీంతో ఆదివారం కూడా ప్రాజెక్టుకు చెందిన 18 గేట్లను పూర్తిగా ఎత్తి లక్ష క్యూసెక్కుల వరద నీటిని గోదావరి నదిలోకి వదిలారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి 30 అడుగులకు పెరిగింది. నల్గొండ జిల్లా భువనగిరి, మిర్యాలగూడ డివిజన్ల వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షం కురిసింది.హైదరాబాద్‌ నగరంలో సాయంత్రం కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 15.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఆదిలాబాద్‌ జిల్లాలో 31.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. సిర్పూర్‌(టి), బెజ్జూర్‌, కౌటాల, కాగజ్‌నగర్‌, దహెగాం బేలా, భీమిని, వాంకిడి మండలాల్లో భారీ వర్షం కురిసింది. బెజ్జూర్‌ మండలంలోని కుష్ణపల్లి, కుకుడ వాగులు ఉప్పొంగాయి. సమీపంలోని 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోటపల్లి, చెన్నూర్‌ మండలాల్లో భారీ వర్షాల వల్ల వాగులు పొంగుతున్నాయి. వేమనపల్లి మండలంలోని నీల్వాయి వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్‌ జిల్లాలో ఆదివారం చిరుజల్లులే కురిశాయి. అత్యధికంగా కాటారం మండలంలో 74 మిల్లీమీటర్లు నమోదైంది. సిరిసిల్ల, మంథని డివిజన్‌లలో కుంటలు, చెరువులు నిండాయి. నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండలో 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *