తల్లి మృతి, తండ్రి పరిస్థితి విషమం
అల్వాల్: తల్లిదండ్రులకు, కుమారునికి మధ్య జరిగిన ఆస్తి వివాదం ఒక కుటుంబాన్ని చిదిమేసింది. రామ్మూర్తి ఎంఈఎస్‌లో పదవీవిరమణ పొంది భార్య లక్ష్మీబాయి, కుమారుడు దేవానంద్‌లతో కలసి అల్వాల్‌లోని జానకీనగర్ కాలనీలో నివాసముంటున్నారు. దేవానంద్ క్యాబ్‌లో డ్రైవరుగా పనిచేస్తూ మద్యానికి బానిసై అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో కుటుంబంలో గత ఆరు నెలలుగా తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. మద్యం మత్తులో ప్రతిరోజూ తల్లిదండ్రులను హింసిస్తూ ఆస్తి పంపకాలు చేయాలని దేవానంద్ ఘర్షణ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కూడా తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో మీరు ఛస్తేనే ఆస్తిలో వాటా వస్తుందంటూ ఇంటిలో ఉన్న యాసిడ్ సీసాను తెచ్చి తల్లిదండ్రులకిచ్చి తాగమన్నాడు. దీంతో వారు యాసిడ్ తాగారు. తరవాత దేవానంద్ వారిని ఆస్పత్రికి తరలించగా వైద్యులు తల్లి అప్పటికే చనిపోయిందని తెలిపి తండ్రి రామ్మూర్తికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రామ్మూర్తి పరిస్థితి విషమంగా ఉంది. కేసును అల్వాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




