Tuesday, 3 November 2026

‘సీఎం’ రేసులో జవదేకర్‌… సుష్మా!

మహారాష్ట్ర, హర్యానాలలో ఊపందుకున్న ఊహాగానాలు
మరాఠా గడ్డపై ‘మహా’ పోటీ.. హర్యానాలో కానరాని నేతల సందడి
: అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఆధిక్యం తథ్యమన్న సర్వేల నేపథ్యంలో మహారాష్ట్ర, హర్యా నాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ సిద్ధమైంది. దీంతో మహారాష్ట్ర సీఎం పీఠాన్ని ఆశిస్తున్నవారు చాలామందే కనిపిస్తున్నారు. నితిన్‌ గడ్కరీ పేరు బలంగా వినిపించినా రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ వర్గాల కథనం ప్రకారం… అధ్యక్షుడు అమిత్‌షా ఈ అంశంపై ఇప్పటికే ప్రధాని మోదీతోపాటు మంత్రులు అరుణ్‌జైట్లీ, నితిన్‌గడ్కరీలతో చర్చించారు. ఈ సందర్భంగా సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌వైపు మొగ్గు కనిపించినట్లు వార్తలు వెలువడటం గమనార్హం. కాగా, గద్దెనెక్కబోయేది తానేనంటూ దివంగత కేంద్రమంత్రి గోపీనాథ్‌ ముండే కుమార్తె పంకజ బాహాటంగానే ప్రకటిస్తున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్‌కూ అవకాశాలున్నాయని, చురుకైన యువనేతగా ఆయన ప్రధాని దృష్టిని ఆయన ఆకర్షించారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. కాగా, హర్యానాలో సీఎం పదవికి పోటీపడే బలమైన నేతలెవరూ బీజేపీలో లేరు. కాబట్టి సీఎం అభ్యర్థి ఢిల్లీనుంచే దిగుమతి కాక తప్పదన్నది స్పష్టం. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే, రాష్ట్ర సీనియర్‌ నేత కెప్టెన్‌ అభిమన్యు సింగ్‌ ఆమెకు గట్టి పోటీదారు కాగలరని విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించే జాట్‌వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనవైపు పార్టీ మొగ్గు చూపవచ్చునని అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా అనేక సందర్భాఆల్లో ఆయన నాయకత్వ లక్షణాలను ప్రశంసించడాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
రెండు రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలే: వెంకయ్య
చెన్నై, అక్టోబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర, హర్యానాలలో ప్రభుత్వా లు ఏర్పాటు చేసేది బీజేపీయేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాషా్ట్రల్లో ఒకే పార్టీ అధికారంలో ఉండాలన్నది ప్రజల అభిమతమని అందుకే తమకు స్పష్టమైన ఆధిక్యం లభిస్తుందని పేర్కొన్నారు. విపక్షాలు కేంద్రంపై చౌకబారు విమర్శలు చేస్తున్నాయన్నారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత అంశాన్ని ప్రస్తావించగా- కోర్టు పరిధిలో ఉన్నవాటిపై మాట్లాడబోనన్నారు. అయితే, ఓ కేసుపై 18ఏళ్లు విచారణ సాగడం శోచనీయమన్నారు. దోషులు శిక్ష అనుభవించాల్సిందేనని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *