Monday, 2 November 2026

హైదరాబాద్‌లో అమ్మకానికి డిగ్రీలు

విదేశాల్లోనూ చెల్లుబాటు అవుతున్న సర్టిఫికేట్లు
ఏబీఎన్‌ స్టింగ్‌ ఆపరేషన్‌లో బద్ధలైన విద్యా వ్యాపారం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 22 : మహానగరంలో మాయగాళ్లు అనేకరకాలుగా ఉంటారు. ఎవరి దుకాణం వారిదే… ఎవరి దందా వారిదే… తమ ఆటలు సాగినంతకాలం అమాయకులకు కుచ్చుటోపీలుపెడుతూ పోతుంటారు. పాపం పండిన రోజు అడ్డంగా దొరికిపోతారు. హైదరాబాద్‌ మహానగరంలో ఇలాంటి ఓ మహామాయగాడి గుట్టును దమ్మున్న చానల్‌ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది.

జనరల్‌గా చాలా మంది కష్టపడి చదివి డిగ్రీ పట్టాలు సంపాదించి సంతోషపడతారు. కానీ కొంత మందికి అంత ఓపిక ఉండదు షార్ట్‌కట్‌లో అన్నీ చకచకా అయిపోవాలి.. అలాంటి ఇన్‌స్టిట్‌మైండ్‌ విద్యార్థుల కోసం వెలిసింది ఓ ఘరానా విద్యా సంస్థ. గూగుల్‌లో ‘హెచ్‌వైడిఇఆర్‌సి’ అని కొడితే హైదరాబాద్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పేరుతో ఆకర్షణీయమైన వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. ఈ సంస్థ కింద డజను విద్యా సంస్థలు పనిచేస్తున్నట్లు అడ్రస్‌లతో సహా వివరాలు ఉంటాయి. స్కాలర్‌షిప్‌ల గురించి, విదేశాల్లో ప్లేస్‌మెంట్ల గురించి ఒకటేమిటి అరచేతిలో వైకుంఠమే చూపించారు.

ఇదేదో ఉడాల్‌ కేసని ఏబీఎన్‌కు ఉప్పందింది. చదువుల పేరుతో పెద్ద గ్రంథమే నడుస్తుందని అర్థమైంది. ఇక్కడ ఏ డిగ్రీ కావాలన్నా కేష్‌ కొడితే డిగ్రీ వచ్చేస్తుంది. నగరంలోని కూకట్‌పల్లిలో ‘హెచ్‌వైడిఇఆర్‌సి’ అడ్డ. ఇలాంటి అడ్డాలు నగరంలో మరో మూడు ఉన్నాయి. పంజగుట్ట, ఎర్రగడ్డ, విద్యానగర్‌లలో వీటి కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. కొంత రెక్కి తర్వాత ఏబీఎన్‌ కూకట్‌పల్లిలో ఉన్న కార్యాలయాన్ని ఎంచుకుని ఆపరేషన్‌ మొదలుపెట్టింది. ఇక్కడ క్లాస్‌రూమ్‌లుకానీ, లెక్చరర్లూకానీ ఎవరూ లేరు. స్టాప్‌ మాత్రం చాలా మంది ఉన్నారు. కస్టమర్లు వస్తూ పోతూ ఆఫీసు కలకలలాడుతుంది. ఏబీఎన్‌ ప్రతినిధి ముందుగా ఫోన్‌ ద్వారా అపాయింట్‌మెంట్‌ తీసుకుని అడుగుపెట్టారు. ‘‘విదేశాలకు వెళ్ళాలి డిగ్రీ కావాలి ఎంత సమయం పడుతుంది.. ఎంత ఖర్చు అవుతుందని అడిగితే’’… అక్కడ ఉన్న మేడమ్‌ అన్నిటికి చకచక జవాబులు ఇచ్చింది. డబ్బుల విషయంలో బేరాలు ఉంటాయి. బకరాలు దొరికితే రూ. లక్షల్లో బాదుతారు. ఏబీఎన్‌ ప్రతినిధి తనకు కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ కావాలని అడిగారు. మొదట రూ. లక్ష చెప్పారు. అయితే గట్టిగా బేరం చేసేసరికి రూ. 25 వేలుకు ఒప్పుకున్నారు. పాపాల పుట్ట బద్దలు కొట్టడానికి ఏబీఎన్‌ రూ. 25 వేలు సమర్పించుకుంది. డబ్బులు చేతులు మారగానే సర్టిపికేట్ల తయారీ ప్రొసెస్‌ ప్రారంభం అవుతుంది. మూడు నెలల్లో ఆ సర్టిఫికేట్లు మన చేతుల్లోకి వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *