కాల్గరీ కెనడాలో నవరాత్రి సాంస్కృతిక సంబరాలు

కెనడా : కాల్గరీ కెనడాలో శ్రీ అనఘా దత్త సొసైటీ ఆఫ్ కాల్గరీ, శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తలు లలిత ద్వివేదుల, శైలేష్ భాగవతుల ఆధ్వర్యంలో గణపతి ఊరేగింపు వేడుకలు కాల్గరీ నగర డౌన్ టౌన్ వీధులలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాజ్‌కుమార్ శర్మ మందిరంలో ప్రతిరోజు గణపతి అభిషేకం, అర్చన, గణపతి హోమం, హారతులు విధిగా నిర్వహించారు. గణపతి నవరాత్రి, ఊరేగింపు సంబరాలు ఘనంగా నిర్వహించుటకు చాలామంది వాలంటీర్లు, వ్యాపార యజమానులు తమ  ప్రత్యేక సహాయాన్ని అందించారు. నగర వీధుల్లో గణపతి ఊరేగింపు కోసం హెచ్ అండ్ హెచ్ డెకర్స్, హేమ, హర్షిణి ట్రక్ ను ఎంతో అందంగా అలంకరించారు. గణనాధుని యాత్రకు కాల్గరీ ఎమ్మెల్యే పీటర్ సింగ్ విచ్చేసారు. కాల్గరీ నగరంలో ఇటువంటి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అనఘా దత్త యజమాన్యంని ప్రశంసించారు. భారతీయ సంప్రదాయాన్ని చాటిచెప్పేవి ఇటువంటి కార్యక్రమాలని, అల్బెర్టా ప్రావిన్స్ కల్చర్ డేస్ ను పురస్కరించుకుని భారతీయ శాస్త్రీయ కళలు, నృత్య కచేరీలు, హిందూ వారసత్వ వేడుకలు జరుపుతున్నందుకు లలిత, శైలేష్ ను ఎంతో అభినందించారు. ఉత్తర అమెరికా ఖండంలో ఇటువంటి వేడుకలు జరపడం కష్టమైనప్పటికీ అనఘా దత్తా సొసైటీ ఆఫ్ కాల్గరీ యాజమాన్యం, సభ్యులు భారత సంప్రదాయాలకు పూలబాటలు వేస్తున్నారని ప్రశంసించారు.
కెనడాలో హిందూ వారసత్వ వేడుకల్లో నిర్వహించిన వయోలిన్ కచేరీలో కెనడాలో, యూఎస్ఏలో ఉన్న విద్వాంసులైన ఆరతి శంకర్, అంజన శ్రీనివాసన్ వయోలిన్ వాయించగా.. ఆదిత్య నారాయణ్ మృదంగంతో, రమణ ఇంద్ర కుమార్ ఘటంతో, రత్తన్ సిద్ధు, తంబురాలతో సహకరించారు. విద్వాంసుల అందరిని అనఘా దత్త సంఘం అధ్యక్షురాలు లలిత బహుమతులతో ఘనంగా సత్కరించారు. అక్టోబర్ మాసంలో రానున్న దేవి నవరాత్రి ఉత్సవాలకి లలిత, స్వచ్ఛంద సేవకులైన శోభన నాయర్, మాధవి చల్లా, మాధవి నిట్టల, కళైజ్ఞర్ సంతానం, అర్చకులు రాజ్‌కుమార్ ఘనమైన సన్నహాలు జరుపుతున్నారు