రుణమాఫీ పేరుతో మరోసారి తెలంగాణ రైతులను మోసం
రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే రూ.7 వేల కోట్లు రుణమాఫీకి దారిమళ్లించారన్నారు. హక్కుగా రావాల్సిన రైతుబంధు డబ్బు నుంచి కొంతమొత్తం విదిల్చి, రుణమాఫీ చేస్తున్నమని పోజులు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.40 లక్షల పైచిలుకు రైతులు రూ.లక్ష వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హత ఉందా అని నిలదీశారు. 2014లోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చిందన్నారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి రూ.19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు అని చెప్పారు. కాంగ్రెస్ మానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు రూ.2 లక్షల వరకు ఉన్న పంటరుణాలు అన్నీ వెంటనే మాఫీ చేయాలిలన్నారు. అర్హులైన అందరు రైతులకూ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.