కన్నీటి వీడ్కోలు
– అశ్రునయనాల మధ్య హరికృష్ణ అంతిమయాత్ర
– ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
– చితికి నిప్పంటించిన తనయుడు కళ్యాణ్‌రామ్
– మెహిదీపట్నం నుంచి మహాప్రస్థానం వరకు సాగిన అంతియాత్ర
– పాల్గొన్న రాజకీయ, సినీ ప్రముఖులు
– గంటన్నర సాగిన అంతిమయాత్ర
– హరికృష్ణ పాడెను మోసిన ఏపీ సీఎం చంద్రబాబు
– అభిమానులతో జనసంద్రమైన మహాప్రస్థాన ప్రాంతం
హైదరాబాద్, ఆగస్టు30(జనం సాక్షి) : అన్నగారి రథసారథి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అంతిమ సంస్కారాలు గురువారం సాయంత్రం పూర్తయ్యాయి. హరికృష్ణ అంతిమ సంస్కారాలను జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తి చేశారు. కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ ఆయన చితికి నిప్పంటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. హరికృష్ణకు గౌరవ సూచకంగా పోలీసులు మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం కళ్యాణ్ రామ్ ఆయన చితికి నిప్పంటిచారు. తమ అభిమాన నేతను కడసారి చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మహాప్రస్థానం కన్నీటి సంద్రంగా మారింది.
అభిమానుల కన్నీటి వీడ్కోలు..
మధ్యాహ్నం 2.30గంటల సమయంలో హరికృష్ణ నివాసంమైన మెహదీపట్నం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. సుమారు గంటన్నరపాటు అశేషజనవాహిని మధ్య అంతిమ యాత్ర సాగింది. అంతకు ముందు అంతియయాత్ర వాహనం వద్దకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, వైవీఎస్ చౌదరి, నారా లోకేశ్, హరికృష్ణ సోదరులు బాలకృష్ణ, జయకృష్ణ హరికృష్ణ పాడె మోసి వాహనంలో ఉంచారు. అక్కడ నుండి సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ్గ//-లఓల్గ/వర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్ విూదుగా.. కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్ విూదుగా మహాప్రస్థానానికి చేరుకోనుంది. దారి పొడవును తెదేపా కార్యకర్తలు, నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో దారిపొడవునా హరికృష్ణకు కన్నీటి వీడ్కోలు పలికారు. అమరహై హరికృష్ణ అంటూ నినాదాలు చేశారు. అంతిమయాత్ర లో ఏపీ మంత్రి నారా లోకేష్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతియాత్ర ముందుభాగంలో నడుచుకుంటూ ముందుకుసాగగా, యాత్రలో తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర నేతలు, ఏపీ మంత్రులు దేవినేని ఉమ, పత్తిపాటి పుల్లారావు, డిప్యూటీ సీఎం కె.వి. కృష్ణమూర్తి, ఇతర మంత్రులు, తెదేపా నేతలు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరిగాయి.
స్మారక చిహ్నంకు స్థలం కేటాయింపు..
నందమూరి హరికృష్ణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే
ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించిన ప్రభుత్వం అంతేకాకుండా జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాన్నికేటాయించింది. అంత్యక్రియలు ముగిశాక కుటుంబసభ్యుల నిర్ణయం మేరకు స్మారక చిహ్నం నిర్మించే అవకాశం ఉంది.
మహా ప్రస్థానంలో నందమూరి హరికృష్ణ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆయన అంత్యక్రియలను మొయినాబాద్‌లో ఫాం హౌస్‌లో నిర్వహించాలని కుటుంబసభ్యులు అనుకున్నారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరాం అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పడంతో వేదికను మార్చారు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన కుటుంబసభ్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించారు.



