Tuesday, 3 November 2026

అంకాపూర్‌ అభివృద్ధిపై రాష్టాల్ర నజర్‌

ఇక్కడి వ్యవసాయాన్ని అధ్యయనం చేస్తున్న నేతలు

నిజామాబాద్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): దేశంలోనే ఆదర్శంగా నిలిచిన అంకాపూర్‌ గ్రామంపై అందరి దృష్టి నెలకొంది. గ్రామాలను అభివృద్ధి చేయాలనుకునే రాష్టాల్రు అవగాహన కోసం అంకాపూర్‌ను సందర్శిస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. పచ్చని పైరుతో కళకళలాడే అంకాపూర్‌ని చూసిన తర్వాత వెళ్లాలనిపించదని సందర్శకులు చెబుతుంటారు. చాలా ఏళ్ల నుంచి అంకితభావంతో కూడిన పని, ఆధునిక పద్ధతులు పాటిస్తూ అంకాపూర్‌ గ్రామస్తులు అభివృద్ధిలో ముందంజలో ఉన్నారు. దాదాపుగా ఇక్కడి రైతుల పిల్లలందరూ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయినప్పటికీ వీరు మాత్రం వ్యవసాయాన్ని వదలలేదు. ముఖ్యంగా మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో కష్టపడేతీరు ఆదర్శనీయం. తమిళనాడు, మహారాష్ట్ర, కర్టాటక, కేరళ, హర్యానా, పంజాబ్‌, జార్కండ్‌, చత్తీస్‌గడ్‌, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, పశ్ఛిమబెంగాల్‌ తదితర రాష్టాల్ర ప్రజాప్రతి నిధులకు హైదరాబాద్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో శిక్షణ ఇస్తున్నారు. వీరికి క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా అభివృద్ధికి చిరునామా అయిన అంకాపూర్‌కు తీసుకువచ్చారు. రెండు మూడురోజుల నుంచి ఈ బృందం అంకాపూర్‌లో పర్యటించింది. ఇక్కడి రైతుల ఇళ్లను, వారు పొందుతున్న సౌకర్యాలను, పట్టణాన్ని తలపించే గ్రామాన్ని చూసి ముగ్దుల య్యారు.  దాదాపుగా ప్రతి ఇంటికి కారు, బంగ్లా ఉండడం విశేషం. పంటలన్నీ పచ్చగా ఉండడం, అధిక దిగుబడులు రాబట్టుకోవడంపై వారు ఆరా తీశారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్లే వీరు లాభాలను ఆర్జించగలిగారు. అంతేకాకుండా సంప్రదాయ పంటలైన వరియే కాకుండా వాణిజ్య, ఆరుతడి పంటలపై దృష్టిసారించడం బృందంలోని సభ్యులకు ఆశ్చర్యానికి గురిచేసింది. తమ దగ్గర కేవలం సంప్రదాయమైన వరి, గోధుమ మాత్రమే పండిస్తారని పంజాబ్‌కు చెందిన లుథియాన జడ్పీచైర్మన్‌ బాగ్‌సింగ్‌ తెలిపారు. ఇక్కడ వరితో పాటు వాణిజ్య పంటలు అధికంగా పండించి లాభాలను అర్జించడం అభినందనీయమని అన్నారు. తాను అక్కడికి వెళ్లిన తర్వాత ఇలాంటి పంటలు పండించాలని తమ రైతులకు చెబుతామని అన్నారు. అంతేకాకుండా రైతులకు వ్యవసాయంపై ఉన్న ఆసక్తి, శ్రమించే గుణం వల్లే ఇంత అభివృద్ది సాధ్యమయిందన్నారు. వీరికి జిల్లా అధికారులు అంకాపూర్‌ అభివృద్ధికి గల కారణాలు, వ్యవసాయ పద్ధతులను ప్రజల స్ధితిగతులను, కఠోరశ్రమ, వారి అభిరుచులను వివరించారు. ప్రతి వ్యవసాయ క్షేత్రంలోకి బృంద సభ్యులను తీసుకెళ్లి స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు పంటల సాగు విధానాన్ని వివరించారు. పంటమార్పిడి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నీటి వినియోగం, నిల్వలు, యాజమాన్య పద్ధతులను పేర్కొన్నారు. మొత్తం 42 మంది గల బృందసభ్యులను సమావేశపరిచి అన్ని విషయాలను కులంకుశంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు పలు ప్రశ్నలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఏ పంటలు వేస్తే అధిక లాభం వస్తుంది, తక్కువ ఖర్చు, తక్కువ నీటి వినియోగంతో పండే పంటలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యండా భూసారం మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై మాట్లాడారు. రసాయన ఎరువుల వాడకం, ఎంత మోతాదులో ఉపయోగించాలి అన్న దానిపై చర్చ జరిగింది. అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడితే ఇబ్బందులు వస్తాయని రైతులు చెప్పారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రసాయనిక ఎరువులను వాడుతామని వారు పేర్కొన్నారు. కలుపు నివారణ తదితర అంశాల్లో ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా

విత్తనోత్తత్పి మెళకువలను, విత్తనశుద్ది కేంద్రాలను సందర్శించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాలిహౌస్‌ వ్యవసాయాన్ని వీక్షించారు. వీటన్నింటితో పాటు ఉత్పత్తి అయిన ధాన్యాన్ని, పంటలను ఎలా మార్కెటింగ్‌ చేస్తున్నారో కూడా అడిగి తెలుసుకున్నారు. ఎవరికి పడితే వారికి పంటను ధారాధత్తం చేయకుండా ప్రభుత్వరంగ సంస్థలకు, మార్కెట్‌లను ఉపయోగించుకుంటున్న తీరును బృందం సభ్యులు పరిశీలించారు. అవసరమైతే పంటను ప్రభుత్వ గిడ్డంగుల్లో ఉంచడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో కూడా రైతులను ఉత్తేజపరుస్తామని బృందంలోని ఒడిశా ప్రజాప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కాగా తమ దగ్గర రైతులు చాలా వెనుకబడి ఉన్నారని, పాత పద్ధతులను అనుసరించి పంటలు పండించడంతో వెనకబడిపోయారని వారు పేర్కొన్నారు. కేవలం సంవత్సరంలో ఒక పంటను మాత్రమే వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సదుపాయం లేకపోవడం ఒక కారణమని వారు అభిప్రాయపడ్డారు. అయితే ఇక్కడ ఉన్న కొన్ని నీటి వనరులను కూడా ఉపయోగించుకునే పద్ధతి చాలా నచ్చిందని జార్ఖండ్‌కు చెందిన సోనియా సమంత్‌ అనే జంషెడ్‌పూర్‌ జడ్పీ చైర్మన్‌ పేర్కొన్నారు. తమ దగ్గర కూడా ఇలాంటి పద్దతులు అనుసరించి ఉన్న నీటితో, తక్కువ ఖర్చుతో పంటలు పండించి, అధిక లాభాలు అర్జించేలా అక్కడి రైతులకు సూచనలు, సలహాలు ఇస్తామని ఆమె పేర్కొన్నారు. ఇక్కడ తెలుసుకున్న అంశాలు తమకు, తమ రైతులకు ఎంతో ఉపయోగకరమని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ఇక్కడి రైతుల అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని యూపీకి చెందిన కమలేశ్‌ ఆర్య అనే అమ్రెహా ప్రాంతానికి చెందిన జడ్పీచైర్మన్‌ పేర్కొన్నారు. అంకాపూర్‌ మహిళా రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిలో నిమగ్నమవుతున్న తీరు తమకు ఎంతో  ఆకట్టుకుందని ఆమె పేర్కొన్నారు. తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడినప్పటికీ వీరు పనిని దైవంగా భావించి వ్యవసాయం చేయడం ఎంతో ఆదర్శనీయమన్నారు. పాల్గొన్న బృంద సభ్యుల్లో పలు రాష్టాల్ర జడ్పీ చైర్మన్లు ఎక్కువగా ఉన్నారు. వారికి జిల్లా అధికారులు, ప్రజప్రతినిధులు, స్థానిక రైతులు చక్కని సహాయం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *