Monday, 2 November 2026

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మాసిటీ

1

కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యత

11వేల ఎకరాల్లో విస్తీర్ణం

హెలిక్యాప్టర్‌లో స్థలాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 3 (జనంసాక్షి) : అంతర్జాతీయ ప్రమాణాలతో, కాలుష్యరహిత  ఫార్మాసిటీ నెలకొల్పుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.   కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. హైదరాబాద్‌ ఫార్మాసిటీ పేరుతో ముచ్చర్ల పరిధిలో 11వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ఫార్మాసిటీ, ఫార్మా పరిశోధన కేంద్రం ఏర్పాటుచేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో పారిశ్రామికవేత్తలతో కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ విహంగ వీక్షణం ద్వారా అటవీ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ… జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ వ్యవస్థతో ఫార్మాసిటీ పనిచేస్తుందన్నారు. ఫార్మా కంపెనీల సిబ్బంది కోసం టౌన్‌షిప్‌ నిర్మిస్తామన్నారు. రూ.30వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయని సీఎం తెలిపారు. బేగంపేట విమానాశ్రయ నుంచి పారిశ్రామిక వేత్తలతో కలిసి రెండు హెలిక్టాపర్లలో బయలుదేరిన సీఎం విహంగ వీక్షణం చేపట్టారు. ఔషధ, చిత్రనగరిలకు భూముల అన్వేషణ కోసం పరిశించారు. సీఎంతో పాటు రెడ్డిస్‌, అరబిందో ఫార్మా, హెటిరో సంస్థల ప్రతినిధులు ఏరియల్‌ సర్వేలో పాల్గొన్నారు. తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి భూసేకరణలో భాగంగా సిఎం నేరుగా భూములను పరిశీలించారు. సిఎం రాక కోసం  రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దాదాపు 10 వేల ఎకరాలకు పైగా భూముల్ని రెవెన్యూ శాఖ సేకరిస్తోంది. రెండు జిల్లాలకు చెందిన ఐఏఎస్‌లు శ్రీధర్‌, చంపాలాల్‌, శర్మన్‌లు రెవెన్యూ అధికారులతో కలిసి జిల్లాల్లో పరిశీలించారు.  గుర్తించిన భూముల్లో జెండాలు, గాలి బూరల ఏర్పాట్లు చేశారు. రెండు జిల్లాల్లో కలిపి ప్రాథమికంగా దాదాపు పది వేల ఎకరాలకుపైగా సేకరించాలని ఇరు జిల్లాల అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దిల్‌, భూదాన్‌, సీలింగ్‌, పట్టా భూములు కూడా ఫార్మాసిటీకి కేటాయించేందుకు, చర్యలు తీసుకుంటున్నారు. ఈ రెండు జిల్లాలోని అన్నిరకాల భూములతోపాటు అటవీ శాఖ పరిధిలోని మరో ఆరు వేల ఎకరాల వివరాలను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది.  బుధవారం మధ్యాహ్నం నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లలో పారిశ్రామిక వేత్తలతోపాటు రెండు రెండు జిల్లాల పాలనాధికారులు, రెవెన్యూ సిబ్బంది ఈ భూముల పరిశీలనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పార్మాసిటీ భూముల పరిశీలనతోపాటు రిజర్వు ఫారెస్టును కూడా  ఏరియల్‌ సర్వే ద్వరా పరిశీలించారు.

ముచ్చర్లలో 11 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ

రంగారెడ్డి జిల్లా ముచ్చెర్ల పరిధిలో 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మాసిటీని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. బుధవారం ప్రత్యేక హెలికాప్టర్‌ లో అధికారులు, ఫార్మా కంపెనీ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి ఫార్మాసిటీ ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలిం చారు. ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ,హైదరాబాద్‌ ఫార్మాసిటీ పేరుతో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఫార్మా యూనివర్సిటీ, రీసెర్చ్‌ సెంటర్‌ను కూడా స్థాపించనున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎకో ఫ్రెండ్లీ ఫార్మా సిటీని నెలకొల్పాలని నిర్ణయించారు. అక్కడే ఫార్మా పరిశ్రమలతో పాటు ఉద్యోగుల కోసం టౌన్‌ షిప్‌ కూడా నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌ వ్యవస్థతో కంపెనీ పని చేస్తుందన్నారు. స్థానిక ఫార్మా కంపెనీలే అక్కడ 30 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు.70 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఫార్మాసిటీ ప్రతిపాదిత స్థలం పై కంపెనీ ప్రతినిధులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.ఫార్మాసిటీ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి మహేందర్‌ రెడ్డి , ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, అధికారులు ప్రదీప్‌ చంద్ర,నర్సింగరావు,జయేష్‌ రంజన్‌, ఫార్మా కంపెనీల ప్రతినిధులు పార్ధసారధి రెడ్డి, రత్నాకర్‌ రెడ్డి,సతీష్‌ రెడ్డి,నిత్యానందరెడ్డి,నారాయణరెడ్డి,సంతోష్‌, ఆనంద్‌,మొహన్‌ రావు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *