Tuesday, 3 November 2026

అందరూ కలవాల్సిన..  సమయం వచ్చింది


– దేశంలో వ్యవస్థలన్నింటిని బీజేపీ భ్రష్టుపట్టించింది
– ప్రజాస్వామ్య అనివార్యత వల్లే బీజేపీయేతర శక్తులను ఏకం చేస్తున్నా
– ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలన్నదే ఎన్టీఆర్‌ ఆశయం
– నాడు ఎన్టీఆర్‌ చేసిన పనే.. నేడు నేనూ చేస్తున్నా
– దేశానికి ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది
– తెలంగాణలో పొత్తుకు కేసీఆర్‌ నిరాకరించారు
– పార్టీని నిలబెట్టుకొనేందుకే కూటమిలో చేరాం

అమరావతి, నవంబర్‌2(జ‌నంసాక్షి) : దేశం ప్రమాద పరిస్థితుల్లో ఉందని, బీజేపీ నాలుగేళ్ల పాలనలో దేశంలోని అన్ని వ్యవస్థలనీ బ్రష్టు పట్టించిందని, నిరంకుశత్వాన్ని నిలదీసే శక్తులన్నీ ఏకంకావాల్సిన సమయం ఆసన్నమైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం సీఎం టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ అనివార్యత వల్లే బీజేపీపై పోరాటమని తెలిపారు. ప్రజాస్వామ్య అనివార్యత వల్లే బీజేపీయేతర శక్తులను ఏకంచేస్తున్నామని, దేశంలో అన్ని వ్యవస్థలను బీజేపీ నేతలు భ్రష్టుపట్టించారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. సీబీఐ అవినీతి కంపులో కూరుకుపోయిందన్నారు. కేంద్రం ఈడీని చెప్పుచేతల్లోకి తీసుకుందని, ఆర్బీఐని పతనావస్థకు నెట్టిందని, బ్యాంకులపై సామాన్యులకు నమ్మకం పోగొట్టిందని చంద్రబాబు ఆరోపించారు. దేశానికి ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా టీడీపీ క్రియాశీల పాత్ర పోషించిందని చంద్రబాబు చెప్పారు. ‘దేశాన్ని కాపాడాలి, రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
కలిసొచ్చే పార్టీలన్నీ ఏకం కావాలి, కలిసి పనిచేయాలని చంద్రబాబు అభిప్రాయంవ్యక్తం చేశారు. గోద్రా అల్లర్లలో మోదీని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది టీడీపీనే అని, ట్రిపుల్‌ తలాక్‌కు మద్దతు ఇవ్వబోమని ఖరాఖండిగా చెప్పామని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసమే 2014లో బీజేపీతో కలిశామని చంద్రబాబు వివరించారు. 1982లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, నేడు అదే ఆత్మగౌరవానికి కలుగుతున్న అవమానాలకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నానని  వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  నిరంకుశత్వాన్ని ఎదిరించే గుణం తనకు ఎన్టీఆర్‌ నుంచే వచ్చిందని తెలిపారు. కలసి వచ్చే రాజకీయ పార్టీలను ఏకం చేసే ఆలోచనలో ఉన్నానని అన్నారు. ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం ఎన్టీఆర్‌ నిర్దేశించిందేనని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో బాగుండాలన్నదే టీడీపీ లక్ష్యమని, తెలంగాణలో పొత్తుకు కేసీఆర్‌ నిరాకరించారని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీని నిలబెట్టుకునేందుకే మహాకూటమిలో చేరామన్నారు. కేసీఆర్‌ థర్డ్‌ ఫ్రంట్‌ పేరుతో హడావుడి చేసి వదిలేశారని అన్నారు. 5కోట్ల మంది ప్రజల కోసమే బీజేపీపై ధర్మపోరాటం ప్రారంభించామని, నల్లధనంపై యుద్ధం అని చెబుతూ మోదీ ప్రభుత్వం అవినీతిపరులతో అంటకాగుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు