– భద్రతాబలగాల బైక్‌ల వెనుక కూర్చోవడంతో బుల్లెట్ తగిలింది
– విలేకరులు తమకు శత్రువులు కాదు..
– వారిపై మేం ఎప్పుడూ దాడులు జరపం
– లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
రాయ్‌పూర్, నవంబర్2(జనంసాక్షి) : దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్‌ను కావాలని చంపలేదని, అసలు ఆయన అక్కడున్నట్లు తమకు తెలియదని.. పోలీసులు బలగాలపై జరిగే కాల్పుల్లో భాగంగా ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని మావోయిస్టులు వివరణ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో మూడు రోజుల క్రితం మావోయిస్టులు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో అచ్యుతానంద్తో పాటు మరో ఇద్దరు భద్రతా బలగాలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ కాల్పులపై తాజాగా మావోయిస్టులు వివరణ ఇచ్చారు. భద్రతా బలగాలపై కాల్పులు జరపడమే తమ లక్ష్యమని, ఆ కాల్పుల్లో పొరపాటుగా దూరదర్శన్ కెమెరామెన్ కూడా చనిపోయాడని తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ మావోయిస్టులు రాసిన లేఖను దర్భా డివిజనల్ కమిటీ సెక్రటరీ సాయినాథ్ విూడియా ద్వారా బయటపెట్టారు. కాల్పులు జరుపుతున్న సమయంలో అచ్యుతానంద్ అక్కడే ఉన్నట్లు తమకు తెలీదని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. దూరదర్శన్ బృందం భద్రతా సిబ్బంది నడుపుతున్న బైక్‌ల వెనక కూర్చోవడంతో వారికీ బుల్లెట్ల గాయాలయ్యాయని చెప్పారు. విలేకర్లు తమ శత్రువులు కారని, వారిపై ఎప్పుడూ దాడులు జరపమని తెలిపారు. బస్తర్ ప్రాంతానికి వచ్చేటప్పుడు విూడియా ప్రతినిధులు
పోలీసులతో కానీ, భద్రతా బలగాలతో కానీ రాకూడదని సూచించారు. దంతెవాడలో దాడి జరిగిన అనంతరం మేం విలేకర్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపామని రాజకీయనాయకులు, పోలీసు అధికారులు అదేపనిగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. మేం కాల్పులు జరిపింది భద్రతా బలగాలపైనని, విలేకరిని చంపాలన్న ఆలోచన లేదన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మా మావోయిస్ట్ పార్టీని తక్కువ చేసి మాట్లాడుతోందని, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దంతేవాడ జిల్లాలోని అరణ్పూర్- బుర్గుమ్ గ్రామాల మధ్య రోడ్డు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఓటర్లను మచ్చిక చేసుకోవడం కోసమే రాజకీయ నాయకులు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఆ లేఖలో విమర్శించారు. రోడ్డు వేస్తున్న సమయంలో స్థానికులు అటువైపుగా వెళుతుంటే పోలీసులు వారిపై దాడి చేస్తున్నారని, వారి ఆగడాలను అడ్డుకోవడం కోసమే మేం దాడి చేయాల్సి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు.




