– తెలంగాణ ఉద్యమం ఫలించింది అంబేద్కర్ రాజ్యాంగంతోనే
– ఆయన ఆశయ సాధనకోసం ప్రభుత్వం పనిచేస్తుంది
– కేంద్రం వెంటనే పీఓఏ చట్టంపై ఆర్డినెన్స్ తీసుకురావాలి
– పేదలకు బ్యాంకులు చేరువ కావాలి
– డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
హైదరాబాద్, జులై28(జనం సాక్షి) : అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలంగానే తాను ఇక్కడ నిలబడగలిగానని, అంబేద్కర్ లేకుంటే తాను లేనని మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగంతోనే తెలంగాణ సాధించుకోగలిగామని అన్నారు. శనివారం నగరంలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఆంధ్రా బ్యాంక్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ 3వ ఆల్ ఇండియా జనరల్ బాడీ విూటింగ్‌కు మంత్రి కడియం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి… ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమం ఫలించింది అంబేద్కర్ వల్లనే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 వల్లే సాధ్యమైందన్నారు. అంబేద్కర్ ఆశయాల మేరకే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. అందరికీ విద్యనందించాలనే అంబేద్కర్ ఆశయంతోనే రాష్ట్రంలో అత్యధిక గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. దళితులు ఎదిగిన తర్వాత కూడా వారిపై దాడులు జరుగుతున్నాయి. అత్యాచార నిరోధ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతున్నదని కడియం ఆవేదన వ్యక్తంచేశారు. ముందస్తు బెయిల్ అవసరం లేదన్న సుప్రీం కోర్టు తీర్పుపై దళితులు రోడ్డెక్కారని, పీఓఏ చట్టాన్ని కాపాడటం కోసం అనేక మంది దళితులు చనిపోయారని కడియం పేర్కొన్నారు. కేంద్రం వెంటనే పీఓఏ చట్టంపై ఆర్డినెన్స్ తీసుకురావాలని, పీఓఏ చట్టాన్ని బలోపేతం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మద్దతిస్తుందన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ పీఓఏ చట్టం కాపాడడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కడియం సూచించారు. పేదలకు లబ్ది చేకూరాలని బ్యాంకులను జాతీయం చేశారని, బ్యాంకుల జాతీయ లక్ష్యం నెరవేరడం లేదని కడియం తెలిపారు. పేదలకు బ్యాంకులు చేరువగా లేవని, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొడుతున్నారు. పేదవాడికి పదివేలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని కడియం ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల వైఖరి వల్లే పేదవాళ్ల కోసం పెట్టిన ప్రభుత్వ ఆర్థిక సహకార పథకాలు వారికి అందడం లేదని కడియం అన్నారు. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ బ్యాంకులను పేదలకు దగ్గరగా తీసుకెళ్లాలని మంత్రి పేర్కొన్నారు.
అంబేద్కర్ లేకుంటే నేను లేను




