Thursday, 5 November 2026

అక్కిరాజుకు పలువురు నివాళి

 

క్రీడారంగ అభివృద్దిని గుర్తు చేసిన ఎమ్మెల్యే

కాకినాడ,నవంబర్‌12(జ‌నంసాక్షి): రాజోలు రారాజు ముదునూరి అక్కిరాజు సేవలు చిరస్మరణీయమని రాజోలు శాసనసభ్యులు గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం రాజోలు యూత్‌ క్లబ్‌ వద్ద దార్ల పెదబాబు అధ్యక్షతన అక్కిరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ సభకు ఎంఎల్‌ఎ సూర్యారావు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ముందుగా అక్కిరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంఎల్‌ఎ మాట్లాడుతూ.. రాజోలులో క్రీడా రంగం అభివృద్ధికి అక్కిరాజు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. యుత్‌ క్లబ్‌ నిర్మాణం, జిమ్‌, సెటిల్‌ కోర్టు వంటి వాటిని రాజోలులో నిర్మించి అధిక సంఖ్యలో క్రీడాకారులను తయారు చేశారని తెలిపారు. రాజోలు నియోజకవర్గాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అక్కిరాజు సినీ రంగాన్ని రాజోలుకు పరిచయం చేశారని కొనియాడారు. రాజోలు పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సాయం చేసి రాజోలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా

నిలిచిపోయారని పేర్కొన్నారు. పోలిస్‌ పోటీ పరిక్షలకు, యోగా, టైక్వాండో, పెన్సింగ్‌ వంటి వాటిని ఉచితంగా శిక్షణ ఇప్పించారని రాజోలులో అన్ని రంగాల ప్రజలకు అక్కిరాజు ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన బాటలో యువత ముందుకు సాగాలని కోరారు. వచ్చే ఉగాది నాటికి యూత్‌ క్లబ్‌ అవరణలో అక్కిరాజు విగ్రహం ఏర్పాటు చేసి, అక్కిరాజు పేరిట క్రీడా రంగానికి ఇన్‌డోర్‌ స్టేడియానికి ఏర్పాట్లకు కృషి చేస్తానని ఎంఎల్‌ఎ హావిూ ఇచ్చారు. అనంతరం దార్ల పెదబాబు మాట్లాడుతూ.. కమిటీతో చర్చించి ముదునూరి అక్కిరాజు పేరున జిమ్‌కు నామకరణం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ మానేపల్లి అయ్యాజీ వేమా, సీనియర్‌ న్యాయవాది పొన్నడ హనుమంతరావు, రాజోలు ఎస్‌ఐ ఎం.నాగరాజు, భూపతి రాజు, ఈశ్వర రాజు వర్మ, బత్తుల రాము, అనుచూరి పురుషోత్తం, మట్డా ఎడుకొండలు, తెన్నేటి కిషోర్‌, పామర్తి రమణ, రావి మురళీ, రాంబాబు, కుంపట్ల చిన్నారి, నానాజీ, లక్కింశేట్టి చిన్నయ్య, పలువురు పాల్గొన్నారు.