– మహాకూటమి ద్వారా వదిలిస్తాం
– చివరి బీఫారం తీసుకొనేది నేనే
– 11 సీట్లపై క్లారిటీ వచ్చింది.. మరో మూడు సీట్లపై స్పష్టత రావాలి
– తెదేపా ఆశావహులు ఎలాంటి ఆందోళన చెందవద్దు
– తెదేపా తెలంగాణ అధ్యక్షుడు రమణ
హైదరాబాద్, నవంబర్12(జనంసాక్షి) : పోరాడి సాధించుకున్న తెలంగాణకు గులాబీ చీడ పట్టిందని, ఐదేళ్ల తెరాస పాలనలో ప్రజలకు ఇబ్బందులే తప్ప జరిగిన మేలు లేదని, మహాకూటమి ద్వారా గులాబీ చీడను వదిలించి ప్రజాపాలన తీసుకొస్తామని టీతెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ ఎదుట తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ కూటమిపక్షాలకు ఇవ్వొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం టిక్కెట్‌ను రొక్కం భీమ్ రెడ్డికి కేటాయించాలని కార్యకర్తలు పట్టుబట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ ముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎన్టీఆర్ ట్రస్ట్ వద్దకు వచ్చిన ఎల్. రమణ ఆందోళన కారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, చంద్రబాబు సూచనల మేరకు ప్రతి ఒక్క తెదేపా కార్యకర్త ముందుకు సాగాలనిసూచించారు. మహాకూటమిలో భాగంగా టీడీపీకి ఇచ్చే 11సీట్ల విషయంలో క్లారిటీ వచ్చిందని, మరో మూడు సీట్లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రజల మసనుల్లో టీడీపీకి గౌరవప్రదమైన స్థానం ఉందని అన్నారు. తెలుగు ప్రజలు మెచ్చిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. టీడీపీలో అందరూ బీఫారం తీసుకున్న తర్వాత… చివరి బీఫారం తీసుకునేది తానేనని చెప్పారు. సాయంత్రంకల్లా సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందని చెప్పారు. గత అనుభవంతో అభ్యర్థుల ప్రకటనపై ఆచితూచి వ్యవహరిస్తున్నామని తెలిపారు. మంగళవారం ఒకే వేదికపై నుంచి మహాకూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. తెరాస ప్రభుత్వం గత 51 నెలల్లో ఖర్చు చేసిన రూ. 8 లక్షల కోట్లకు కేసీఆర్ లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ అర్ధాంతరంగా ప్రభుత్వాన్ని రద్దు చేశారని విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలు తెరాసకు 63 సీట్లు ఇస్తే వాటిని అక్రమంగా 93కి పెంచుకున్నారని ఆరోపించారు. తెరాస నాయకులతో సంప్రదించకుండా సొంత నిర్ణయంతో కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారని.. ఆ నిర్ణయం ప్రజల్లో తిరస్కరణకు గురైందన్నారు.
ఏంతో మంది ప్రాణత్యాగాలతో తెలంగాణ వచ్చిందని అన్నారు. అలాంటి తెలంగాణలో ప్రజల అభిప్రాయానికి విలువ లేకుండా పోయిందని రమణ పేర్కొన్నారు. కేసీఆర్ దొరల పాలన కొనసాగిస్తున్నారని.. దానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. తెరాస పార్టీ ప్రచారానికి ఖర్చు చేస్తున్న వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని నిలదీశారు.
కోదండరామ్ కనీసం సర్పంచిగా గెలవరన్న కేసీఆర్ ఎందుకు ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారని రమణ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి గులాబీ చీడ పట్టిందని.. దానిని తమ కూటమి వదిలిస్తుందని స్పష్టం చేశారు. 2014లో తెదేపాకు ప్రజలు రెండంకెల స్థానాలను ఇచ్చారని.. మహాకూటమి అధికారంలోకి వచ్చేందుకు తాను, రావుల స్థానాలను ప్రస్తుతం త్యాగం చేశామని రమణ చెప్పారు.




