– వారందరికీ అండగా ఉంటాం
– తెలంగాణకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసింది
– విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది
– నాలుగేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాం
– మరో 15ఏళ్లు తెరాసనే అధికారంలో ఉంటుంది
– ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
– భారీగా తెరా తీర్థం పుచ్చుకున్న ఆర్యవైశ్యులు
– పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ
హైదరాబాద్(జనం సాక్షి): అగ్రకులాల్లోనూ పేదలు చాలా మంది ఉన్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఏ పని చేసినా చిత్త శుద్ధితో చేస్తారన్నారు. స్వాతంత్యం వచ్చి 70 ఏళ్లయినా దేశంలో ఇంకా వేలాది గ్రామాలకు కరెంట్ లేదన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నారు. ఆంధ్రాకు, తెలంగాణకు బలవంతపు పెళ్లి చేసింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధోగతి పాలు చేసిందని కేటీఆర్ అన్నారు. వనరులున్నా దేశం అభివృద్ధి చెందలేదన్నారు. 1969 ఉద్యమంలో తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు. విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిలా చేసి చూపించటమే కేసీఆర్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉన్నారని, మరో పదిహేనేళ్ల పాటు తెలంగాణ ప్రభుత్వంమే అధికారంలో ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. నాలుగేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉమ్మడిపాలకులు తెలంగాణ ప్రజలను విస్మరించారని, దీంతో ఏకతాటిపై కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమించారని, దీంతో విధిలేని స్థితిలో తెలంగాణ ప్రత్యేక ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.
అగ్రకులాల్లోనూ చాలా మంది పేదలున్నారు




