మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం పోఖ్రాన్-2 అణు పరీక్షను నిర్వహించేందుకు అగ్రరాజ్యం అమెరికా కళ్లుగప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న ఐదు అగ్రదేశాలకే పరిమితమైన అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని భారత్ కూడా సొంతం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే అమెరికాను ఆయన బురిడీ కొట్టించారు. అదెలాగంటే…
అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని భారత్ కూడా దక్కించుకోవాలని 1998లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వం భావించింది. అమెరికా తదితర దేశాల కళ్లు గప్పి అణు పరీక్షలు నిర్వహించే బాధ్యతను ఆర్.చిదంబరం, అబ్దుల్ కలాం వంటి మేటి శాస్త్రవేత్తలతో పాటు కొందరు సీనియర్ సైనికాధికారులకు అప్పగించారు. అయితే, అణ్వస్త్ర పరీక్ష నిర్వహించాలంటే ఎంచుకున్న ప్రాతంలో పెద్దపెద్ద గోతులు తవ్వాల్సి ఉంది. వీటిని తవ్వడం ఎలా అన్నది ఈ బృందానికి తొలి సవాల్‌గా నిలిచింది. ఆ తర్వాత అణు పరీక్షలకు అవసరమైన యురేనియంను పోఖ్రాన్ ప్రాంతానికి తరలించడం ఎలా అన్నది రెండో సవాలు.
ఎందుకంటే.. విదేశీ ఉపగ్రహాలు అక్కడ నిరంతర నిఘా పెట్టి ఉంటాయి. వాటి కళ్లుగప్పి ఈ పరీక్షను ఎలా విజయంతం చేయాలన్న దానిపై అబ్దుల్ కలాం వ్యూహరచన చేశారు. తమ వ్యూహంలో భాగంగా అణు పరీక్షలు జరగడానికి అనేక వారాల ముందు నుంచీ పోఖ్రాన్‌లో పెద్దపెద్ద గోతులు తవ్వడం ప్రారంభించారు. విదేశీ ఉపగ్రహాలు ఈ గోతులను పసిగట్టాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు భారత్ వివరణ కోరాయి.
ఈ దేశాలకు అబ్దుల్ కలాం చాలా తెలివిగా సమాధానమిచ్చారు. 1974లో అణు పరీక్షల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నామని కొన్నిసార్లు, అక్కడి భూ అంతర్భాగంలో సరికొత్త పరిశోధనలు చేస్తున్నామని మరికొన్నిసార్లు సమాధానమిచ్చారు. మొదట్లో ఈ తవ్వకాలను అగ్రరాజ్యాలు సీరియస్‌గా తీసుకున్నాయి. కానీ వరుసగా తవ్వకాలు చేపట్టడంతో వివరణ అడిగితే ఇలాంటి సమాధానాలే వస్తుండటంతో ఆ దేశాలు మిన్నకుండిపోయాయి.
ఆ తర్వాత అసలు తవ్వకాలు జరిగినా ఎవరికీ అనుమానం రాలేదు. ఇక యురేనియంను తరలించడానికి ఉల్లిపాయల లారీలను అబ్దుల్ కలాం బృందం వినియోగించింది. కింద యురేనియం పైన ఉల్లిపాయలు నింపుకొన్న లారీలు పోఖ్రాన్‌కు తరలించారు. వీటిని సరిహద్దులోని పాకిస్థాన్ బంకర్ల సమీపం నుంచి పోఖ్రాన్‌కు తరలించారని, ఒకవేళ యురేనియం గుట్టురట్టయితే అది పాక్‌దేనని ప్రకటించాలన్నది భారత్ వ్యూహంలో భాగం.
పైగా, ఈ అణ్వస్త్ర పరీక్ష ముగిసేంత వరకు అబ్దుల్ కలాం సైనికాధికారి వేషంలో మేజర్ జనరల్ పృథ్వీరాజ్ అనే మారుపేరుతో విధులు నిర్వహించి, పోఖ్రాన్-2 అణు పరీక్షను విజయవంతం చేశారు. ఇందుకోసం ఆయన 15 రోజుల పాటు రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారిలోనే ఆవాసమున్నారు. అయితే అణు పరీక్షలు జరిగిన మరుక్షణం భారత్‌పై అగ్రరాజ్యాలు విరుచుకుపడి.. వివిధ రకాలైన ఆంక్షలు విధించిన విషయం తెల్సిందే.




