గ్రామాల నుంచి కోతులు వాపస్ పోయేలా కార్యాచరణ
హైదరాబాద్,జూన్8(జనం సాక్షి): హరితహారంతో గ్రామాల్లో మళ్లీ చెట్ల పెంపకాన్ని చేపట్టిన ప్రభుత్వం కోతులను అడవుల్లోకి తరిమేలా అక్కడ వాటికి ఆహారంగా పండ్ల మొక్కలను పెంచుతోంది. ఇందులో భాగంగా ఈ యేడు కూడా అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పండ్ల మొక్కల పెంపకానికి ప్రణాళిక సిద్దం చేశారు. వానలు వాపస్ రావాలి – కోతులు వాపస్ పోవాలన్న సీఎం కేసీఆర్ నినాదం మేరకు అటవీశౄఖ చర్యలు చేపట్టింది. కోతులను అడవులకే పరిమితం చేయాలన్న సదుద్దేశంతో ప్రత్యేక హరితహారం నిర్వహించేందుకు అటవీశాఖ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా కోతులకు ఆహారం కోసం 24 రకాల పండ్ల మొక్కలను గుర్తించింది. ఈ స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా వన్ చైల్డ్ టూ ట్రీస్ అనే నినాదాంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ శాఖ అధికారులు ప్రణాళికలు రచించారు. మూడేండ్లలో కోతులకు సరిపడా ఆహారం దొరికేలా పండ్లమొక్కలను నాటడానికి సిద్ధమవుతున్నారు. సిద్దిపేట నర్సరీలో ఆరులక్షల అటవీ పండ్ల మొక్కలను రెడీచేశారు. మూడేండ్లుగా వరుసగా హరితహారంలో దాదాపు 83 కోట్ల మొక్కలను నాటారు. నాటిన ప్రతి మొక్కను బతికించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. 30 కోట్ల మొక్కలకు జియో ట్యాగింగ్ కూడా పూర్తిచేశారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఏడాదిపాటు ఆకుపచ్చగా ఉండే మొక్కలకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చిన అధికారులు.. ఈ ఏడాది అటవీ పండ్ల మొక్కలను నాటడంపై దృష్టిని కేంద్రీకరించారు. వీటిలో కోతులు ఎక్కువగా ఇష్టపడే పనస, అడవి పనస, నేరేడు, సీతాఫలం, ఇప్ప, ఉసిరి, మేడి, చింత, తునికి, వెలగ, జీడి, మర్రి, రేగు, సీమచింత, ఇరికి, కలిమి, మామిడి, నక్కీర, ఈత, ఓడుగు తదితర మొక్కలున్నాయి. ఆదిలాబాద్ మొదలుకుని పాలమూరు వరకు అన్ని ప్రాంతాల్లోగుట్టలు ఉన్న ప్రాంతాల్లో వీటిని నాటుతారు. దీంతో రానున్న రోజుల్లో ఇవి పెరిగి పండ్ల దశకు చేరుకున్నాక కోతులను అడవులకు తరుముతారు. ఆహారం దొరికితే కోతులు గ్రామాల్లోకి రావని భావిస్తున్నారు. దీనిని విజయవంతం చేసేందుకు అటవీశాఖ కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని మంతరి జోగురామన్న అన్నారు. అలాగే గ్రామాల్లో కోతలు బెడద పోవాలంటే అడవుల్లో వాటికి రక్షణ కల్పించాలన్నారు. పర్యావరణానికి ముప్పు చేసే ప్లాస్టిక్ వ్యర్థాలపై యుద్ధం ప్రకటించి ప్రతి ఒక్కరు వాటిని నిషేదించాలన్నారు.




