Tuesday, 3 November 2026

అడుగడుగునా నిర్భంధం..

C
– ఓయూలో పెద్దకూర తిన్న విద్యార్థులు

– ఎర్రకోట సాక్షిగా బీఫ్‌ ఫెస్టివల్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 10(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సీటీలో విద్యార్థులు తలపెట్టిన బీఫ్‌ ఫెస్టివల్‌కు అడుగడుగునా నిర్భందం ఎదురైంది.  అయినా ఎట్టి పరిస్థితుల్లో బీఫ్‌ ఫెస్టివల్‌ని నిర్వహించి తీరుతామని ప్రకటించిన విద్యార్థులు ఏకంగా దేశ రాజధానిలోనే ఫెస్టివల్‌ని నిర్వహించారు. బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించడానికి అగుగడునా ఇబ్బందులు ఎదురైనప్పటికీ విద్యార్థులు మాత్రం ఫెస్టివల్‌ నిర్వహించడంలో విజయం సాధించినట్లు.. ఆధారాలు నిరూపిస్తున్నాయి. ప్రజాస్వామిక సాంస్కృతిక వేదిక అంతర్జాతీ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో తలపెట్టిన బీఫ్‌ ఫెస్టివల్‌ దేశ రాజధానికి పాకింది. బీఫ్‌ ఫెస్టివల్‌ని అడ్డుకునేందుకు పోలీసులు బుధవారం రాత్రి నుంచే విద్యార్థి నాయకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  తెలంగాణ విద్యార్థి వేదిక సభ్యులు ఢిల్లీ ఎర్రకోట సాక్షిగా బీఫ్‌ తింటూ మా ఆహారం – మా హక్కు అని చాటారు. ఈ సదంర్భంగా తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌ మాట్లాడుతూ బీజేపీ, దాని అనుబంధ సంస్థలు దేశంలో సాంస్కృతిక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. ఆహారం, దుస్తులు, వేష భాషలు, ప్రేమ, పెళ్లి వంటి అన్ని విషయాల్లోనూ తమ ఆధిపత్యం చెల్లాలని లేకపోతే ఈ దేశం విడిచిపోవాలంటూ అసహనాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. అట్టడుగు ప్రజల ఆహార సంస్కృతి అయిన భీఫ్‌ తినే హక్కును అడ్డుకుంటే సహించేది లేదన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఓయూ విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వాతి, అందిప్‌, సహాయ కార్యదర్శి మద్దిలేటి, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నాయకులు విజయ్‌ తదితరులు పాల్గొన్నారునరేంద్రమోడీ అనుసరిస్తున్న హిందుత్వ ఫాసిస్టు ఎజెండా కు వ్యతిరేకంగా విద్యార్థులు నినదించారు. కాగా  ఓపక్క ఉద్రిక్త పరిస్థితులు, ముందస్తు అరెస్ట్‌లు… మరోపక్క గోపూజలు, ఆందోళనకారుల నిరసనలు… ఉస్మానియా యూనివర్శిటీలో పోలీసుల పహారా, హైటెన్షన్‌ మధ్య బీఫ్‌ ఫెస్టివల్‌ కొనసాగింది. అనుకున్నంతగా పెద్దకూర పండుగ సక్సెస్‌ కాకపోయినా విద్యార్థులు మాత్రం ఫెస్టివల్‌ నిర్వహించడంలో పాక్షిక విజయం సాధించినట్లు.. ఆధారాలు నిరూపిస్తున్నాయి. పోలీసులు మాత్రం బీఫ్‌ ఫెస్టివల్‌ను విజయవంతంగా అడ్డుకున్నట్లు చెబుతున్నారు. గురువారం ఉదయం నుంచి పెద్ద కూర పండగ నిర్వహించేందుకు విద్యార్థులు విశ్వ ప్రయత్నాలు జరిపారు. అయితే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్న పోలీసులు బుధవారం రాత్రి నుంచే ఉస్మానియాలో భద్రతా చర్యలు మొదలుపెట్టారు. భారీగా పోలీసులను మోహరించిన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే విద్యార్థులు నిరసనలు చేపట్టడం, ఫెస్టివల్‌ను అడ్డుకుంటామంటూ కొందరు రంగంలోకి దిగడంతో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. పలువురు బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులను పోలీసులు ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకున్నారు.

రాజాసింగ్‌ అరెస్టు…

బీఫ్‌ ఫెస్టివల్‌ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కాషాయ దళాలు తమ వ్యూహాలు తాము రచించుకున్నాయి. బిజెపి, శివసేన, భజరంగ్‌దళ్‌, గోరక్షక్‌దళ్‌ సమితి ప్రతిచర్యలకు దిగాయి. ఆయా సంఘాల కార్యకర్తలు యూనివర్శిటీలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఓయూలోను, చుట్టుపక్కల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. యూనివర్శిటీలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లతో గోడలు కట్టారు. విద్యార్థుల హాస్టళ్ల చుట్టూ రక్షకదళాలను మోహరించి ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

కొంతమేర సఫలం..

పెద్దకూర పండగ నిర్వహిస్తామంటూ శపథం చేసిన విద్యార్థులు ఆ దిశగా కొంతమేర సఫలమైనట్లే కనిపిస్తోంది. ఫెస్టివల్‌ చేశామంటూ కొన్ని ఫొటోలతోపాటు, వీడియోలు సోషల్‌ విూడియాలో ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో కొందరు నిరసనకారులు శివం రోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్‌పై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో సాయంత్రం వరకు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. బీఫ్‌ ఫెస్టివల్‌కు మద్దతు తెలపడానికి వచ్చిన ప్రొఫెసర్‌ పిఎల్‌ విశ్వేశ్వరరావు, పివోడబ్ల్యు సంధ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎవరి ఆహారపు అలవాట్ల మేరకు వాళ్లు పండుగ చేసుకుంటే తప్పేంటని ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు ప్రశ్నించారు.

కొనసాగుతున్న పోలీసు పహారా..

అయితే యూనివర్శిటీ చాలా కూల్‌గా ఉందని విద్యార్థులు ఎవరి చదువులు వారు చదువుకున్నారని చెప్పారు. కాగా ఫెస్టివల్‌ నిర్వహించినట్లు నిర్వాహకులు ప్రసార మాధ్యమాల్లో విజువల్స్‌ అప్‌లోడ్‌ చేయగా వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు ఆయా వ్యక్తులు ఎవరో గుర్తించే పనిలోపడ్డారు. అవసరమైతే వారిని అరెస్ట్‌ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకే తాము నడుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా బీఫ్‌ ఫెస్టివల్‌ను అడ్డుకోవడంలో పోలీసులు సక్సెస్‌ అయ్యారు. ప్రస్తుతం ఓయూలో పోలీసులు పహారా కొనసాగుతోంది.

ఉస్మానియా క్యాంపస్‌లో ఉద్రిక్తత

ఉస్మానియా విశ్వవిద్యాలయం మరోమారు ఉద్రిక్తతలకు వేదికయ్యింది. బీఫ్‌ ఫెస్టివల్‌ పేరుతో కొందరు చేస్తున్న ప్రయత్నాలకు కోర్టు అనుమతి నిరాకరించడంతో  పోలీసులు భారీగా మోహరించారు. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరించి బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహించేందుకు సిద్దమవుతున్న పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గేట్లు మూసివేసి.. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా కట్టడి చేశారు. కేవలం ఎన్‌సిసి గేటు నుంచి గుర్తింపుకార్డు ఉన్న వారిని మాత్రమే క్యాంపస్‌లోనికి అనుమతించారు. అలాగే క్యాంపస్‌కు వెళ్లే అన్ని దారులను మూసేశారు. మరోవైపు లోపలికి వెళ్లినవారిని సైతం బయటకు పంపించి విద్యార్థి నేతల కోసం ఆరాతీశారు. ఎన్‌సీసీ గేటుసవిూపంలో ఉన్న కావేరి వసతిగృహం లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. నర్మద వసతిగృహంతో పాటు ఇతర చోట్ల విస్తృతంగా గాలించారు. డీసీపీ చంద్రశేఖర్‌ రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షించారు. బీఫ్‌ ఫెస్టివల్‌  జరపకూడదంటూ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలుపరిచే క్రమంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇదిలావుంటే దీనిని వ్యతిరేకిస్తూ వచ్చిన ఎబివిపి విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *