Tuesday, 3 November 2026

అదే జోరు .. అదే హోరు..

C

– మూడు చోట్ల టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర

– వరంగల్‌, ఖమ్మంలలో దుమ్మురేపిన కారు

– అచ్చంపేటలో క్లీన్‌స్వీప్‌

హైదరాబాద్‌,మార్చి9(జనంసాక్షి): వరుస విజయాలతో విపక్షాలకు టిఆర్‌ఎస్‌ షాక్‌ ఇస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరవాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ దూసుకుని పోతున్న కారు, తాజాగా మూడు నగరపాలక ఎన్నికలల్లోనూ టాప్‌ గేరులో దూసుకుని పోయింది. విపక్షాలకు దిమ్మతిరిగే ఫలితాలను సాధించింది. అచ్చంపేట నగర పంచాయితీలో అయితే అసలు విపక్షాలకు అడ్రస్‌ లేకుండా 20 వార్డుల్లోనూ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆదివారం జరిగిన వరంగల్‌,ఖమ్మం, అచ్చంపేట ఎన్నికల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. మూడుచోట్లా గులాబీ జెండా ఎగిరింది. మొన్నటి వరంగల్‌ ఉప ఎన్నిక, జహీరాబాద్‌ ఉప ఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ఫలితాలే తాజాగా మరోమారు ప్రతిఫలించాయి. తాజా ఎన్నికల్లో టిడిపి ఎక్కడా ఖాతా తెరవకుండానే కనుమరుగు కావడం విశేషం.  గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాస దూకుడు కొనసాగించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి తెరాస ఆధిక్యంలో దూసుకుపోయింది. మొత్తం 58 వార్డులకు గాను 41 స్థానాలను చేజిక్కించుకుని,స్పష్టమైన ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్‌ 4, భాజపా 1, ఇతరులు 9 డివిజన్లు గెలుచుకున్నారు. ఇక్కడ టిడిపి ఒక్కస్థానం కూడా గెలవలేకపోయింది. ఇక  ఖమ్మం ఖిల్లాపై తెరాస జెండా రెప రెపలాడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మాంచి ఊపు విూదున్న తెరాస అదే దూకుడు ప్రదర్శించి ఖమ్మంలోనూ విజయభేరి మోగించింది. కాంగ్రెస్‌ కాస్త ఫర్వాలేదనిపించినా టిడిపి ఒక్కడివిజన్‌లోనూ ఖాతా తెరవలేకపోయింది. కమ్యూనిస్టులు కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఖమ్మం నగరపాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లు ఉండగా తెరాస 34, కాంగ్రెస్‌ 10, వైకాపా-2, సీపీఐ-2, సీపీఎం-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ నెల 6న జరిగిన ఎన్నికల్లో 2,65,710 ఓట్లకు గానూ 1,79,827 ఓట్లు పోలయ్యాయి. 67.68 శాతం పోలింగ్‌ నమోదైంది. 50 డివిజన్లకు 291 మంది బరిలో దిగారు. టీఆర్‌ఎస్‌ నుంచి 50 మంది, కాంగ్రెస్‌ 42, వైసీపీ 48, టీడీపీ 48, సీపీఎం 40, సీపీఐ 8, బీజేపీ 9, స్వతంత్రులు 46 స్థానాల్లో పోటీ చేశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించింది. మొత్తం 20 వార్డుల్లోనూ తెరాస అభ్యర్థులు గెలుపొంది నగర పంచాయతీ కార్యాలయంపై గులాబీ జెండాను ఎగురవేశారు. ఇక్కడ క్లీన్‌స్వీప్‌ నమోదు చేయడం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. టిఆర్‌ఎస్‌ దెబ్బకు ఇక్కడ కాంగ్రెస్‌, బిజెపి, టిడిపిలు మట్టి కరిచాయి.  ఐదు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పక్రియ పూర్తి చేశారు. అచ్చంపేటలో మహాకూటమి అభ్యర్థులు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మెదక్‌ లోకసభ ఉప ఎన్నిక మొదలు.. నేడు వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్‌, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల వరకు కారు జోరు కొనసాగిస్తోంది. తాజాగా, వరంగల్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పోరేషన్లను దక్కించుకుంది. అచ్చంపేటలో క్లీన్‌ స్వీప్‌ చేసింది. మెదక్‌ ఉప ఎన్నిక, వరంగల్‌ ఉప ఎన్నిక, నారాయణ ఖేడ్‌ ఉప ఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు, తాజా ఎన్నికలు… ఎక్కడ కూడా తెరాస వెనుదిరిగి చూసుకోవడం లేదు. పైగా టిఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు అంతకంతకు పెరుగుతోంది. వరంగల్‌ ఉప ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కంటే మెజార్టీ వచ్చింది. నారాయణఖేడ్‌ ఉప ఎన్నికల్లో సానుభూతిని పక్కన పెట్టి ప్రజలు తెరాసకు ఓటు వేశారు. ఇప్పుడు వరంగల్‌, ఖమ్మం, అచ్చంపేటలో ఘన విజయం సాధించింది. అచ్చంపేటలో కాంగ్రెస్‌, బిజెపి, టిడిపిలు ఐక్య కూటమిగా పోటీ చేశాయి. అయినప్పటికీ కనీసం ఒక్క స్థానం గెలుచుకోలేకపోయాయి. ఇరవై స్థానాలకు ఇరవై స్థానాలనూ కారు దక్కించుకుంది. అన్ని పార్టీలు కలిసి కూడా అధికార పార్టీని ఢీకొట్టలేకపోయాయి. తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పిన బిజెపి, టిడిపిలు మాత్రం ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయాయి. ఖమ్మం జిల్లాలో టిడిపికి మొదటి నుంచి మంచి పట్టు ఉంది. నామా నాగేశ్వర రావు, తుమ్మల నాగేశ్వర రావు వంటి నేతలు పార్టీలో ఉన్నారు. అయితే తుమ్మల తెరాసలో చేరడం, నామా సైలెంట్‌ కావడం.. వైసిపి నుంచి కీలక నేతలు ఎదగడంతో ఖమ్మం జిల్లాలో టిడిపి స్థానాన్ని ఒకవిధంగా వైసిపి కైవసం చేసుకుంది. ఖమ్మం కార్పోరేషన్‌ను కూడా అధికార టిఆర్‌ఎస్‌ గెలుచుకుంది. 50 స్థానాలకు గాను మెజార్టీ 34 స్థానాలు దక్కించుకుంది. వైసిపి, లెఫ్ట్‌ పార్టీలు సింగిల్‌ డిపాజిట్‌కే పరిమితమయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం డబుల్‌ డిపాజిట్‌ సాధించి సత్తా చాటింది. అయితే, ఖమ్మంలో ఒకవిధంగా టిడిపి కంటే వైసిపి తన సత్తా చాటింది. టిడిపి ఒక్కచోటా గెలవలేదు. వైసిపి మాత్రం రెండు స్థానాలు దక్కించుకుంది. తెలంగాణలో 2019 నాటికి సత్తా చాటుతామని, టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న బిజెపి, టిడిపిలు వరుసగా ఎన్నికల్లో చతికిలపడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ పరువు కాపాడుకుంటుంది. ఇప్పుడు ఖమ్మంలో వైసిపి సీట్లు దక్కించుకోవడం, టిడిపి ఒక్కటీ గెలవకపోవడం ద్వారా.. తెలంగాణలో వైసిపి కూడా సైకిల్‌ పార్టీని దాటేసి షాకిచ్చిందని చెప్పవచ్చు. మొత్తానికి, కెసిఆర్‌ ధాటికి విపక్షాలు మాత్రం విలవిల్లాడుతున్నాయి.

ఓటర్లకు కవిత కృతజ్ఞతలు

గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌, అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికల్లో తెరాసను గెలిపించిన ఓటర్లకు నిజామాబాద్‌ ఎంపీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఇచ్చిన హావిూలను అమలు చేస్తామని అన్నారు. బంగారు తెలంగాణ కోసం జరుగుతన్న కృషిలో భాగంగా ప్రజలు తమను దీవించారని అన్నారు.  2019లో కూడా ఇదే విజయం పునరావృతమవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అచ్చంపేట నగర పంచాయతీలో తెరాస, కాంగ్రెస్‌, భాజపా కలిసి మహాకూటమిగా ఏర్పడినా ఒక్క వార్డులో కూడా విజయం సాధించలేక పోయాయన్నారు. విపక్షాలను ప్రజలు నమ్మడం లేదని రుజువయ్యిందన్నారు. సిఎం కెసిఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు నమ్మారని, అందుకే ప్రతి ఎన్నికల్లోనూ విజయం చేకూరుస్తున్నారని అన్నారు.

అచ్చంపేటలో టిఆర్‌ఎస్‌ సంబరాలు

అచ్చంపేట నగర పంచాయతీలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. నగర పంచాయతీలో ఉన్న 20 డివిజన్లలోనూ టీఆర్‌ఎస్‌ గెలుపొంది క్లీన్‌ స్వీప్‌ చేసింది.  టీఆర్‌ఎస్‌ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పటాకులు కాల్చుతూ.. మిఠాయిలు పంచుకుంటూ.. డప్పు దరువులకు ప్రజలు స్టెప్పులేస్తున్నారు. ఇక మహాకూటమిగా పోటీ చేసిన ప్రతిపక్షాలు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయాయి.  అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికల్లో తెరాసను గెలిపించిన ఓటర్లకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు  కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఇచ్చిన హావిూలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. బంగారు తెలంగాణ కోసం జరుగుతన్న కృషిలో భాగంగా ప్రజలు తమను దీవించారని అన్నారు.   అచ్చంపేట నగర పంచాయతీలో తెరాస, కాంగ్రెస్‌, భాజపా కలిసి మహాకూటమిగా ఏర్పడినా ఒక్క వార్డులో కూడా విజయం సాధించలేక పోయాయన్నారు. విపక్షాలను ప్రజలు నమ్మడం లేదని రుజువయ్యిందన్నారు. సిఎం కెసిఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు నమ్మారని, అందుకే ప్రతి ఎన్నికల్లోనూ విజయం చేకూరుస్తున్నారని అన్నారు.  ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ఓటర్లు దీవించారన్నారు. పార్టీ విజయం కోసం శ్రమించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఇచ్చిన హావిూలను అమలు చేసి చూపుతామని అన్నారు. అభివృద్ది ఎజెండాగా ముందుకు సాగుతామని అన్నారు. విజయం సాధించిన కౌన్సిలర్లకు గువ్వల శుభాకాంక్షలు తెలిపారు.

విపక్షాలకు గుణపాఠం చెప్పారు: కడియం

ఖమ్మం, వరంగల్‌, అచ్చంపేటలో అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలు వచ్చాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు తమపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపించాయని చెప్పారు. అభివృద్ది చేస్తున్న విషయాలను పట్టించుకోకుండా కేవలం రాజకీయ కోణంలో విమర్శలు చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోయారని అన్నారు. ప్రజలకు సిఎం కెసిఆర్‌ నాయకత్వంపై విశ్వాసం ఉందని, వారు అభివృద్దిని కోరుకుంటున్నారని అన్నారు. చివరకు మహారాష్ట్రతో ఒప్పందాన్ని కూడా విమర్శించడం ద్వారా టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు అనైతిక రాజకీయాలకు పాల్పడ్డారని అన్నారు. అందుకే ప్రజలు వీరికి గుణపాఠం చెప్పారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *