అధికారంకోసం పొత్తులు బాబుకు అలవాటే

– బీజేపీ పోయాక.. కొత్త పొత్తుల కోసం వెంపర్లాడుతుండు
– సింగిల్‌గా పోటీచేసే దమ్ము చంద్రబాబుకు లేదు
– విలేకరుల సమావేశంలో వైసీపీ నేత అంబటి రాంబాబు
విజయవాడ, మే25(జ‌నంసాక్షి) : అధికారం కోసం ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ఏపీ చంద్రబాబుకే అలవాటేనని, ఎందుకంటే 46 ఉప ఎన్నికలకు సింగిల్‌గా వెళ్లి చిత్తుగా ఓడిపోయారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాంబు అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని విజయం సాధించారని, కానీ ఇప్పుడు అవే పార్టీలు చంద్రబాబు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో శుక్రవారం అంబటి విూడియాతో మాట్లాడారు. కొత్త పొత్తుల కోసం ప్రస్తుతం చంద్రబాబు వెంపర్లాడుడుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎక్కువగా ఏదో ఓ పార్టీతో పొత్తుతోనే విజయాలు సాధిస్తోందన్నారు. సింగిల్‌గా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేని వ్యక్తి చంద్రబాబు. అందుకే 1999, 2004 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. 2009లో వామపక్షాలు, టీఆర్‌ఎస్‌తో, తిరిగి 2014 ఎన్నికల్లో బీజేపీతో మళ్లీ జత కట్టడం నిజం కాదా అని ప్రశ్నించారు. అధికారం కోసం ఏ గడ్డి అయినా కరవడం చంద్రబాబుకు అలవాటే. దేశంలో ఏ పార్టీతోనూ చంద్రబాబు నిజాయితీగా పొత్తు పెట్టుకోలేదన్నారు. చంద్రబాబుతో కలిసే ఏ పార్టీ అయినా మసి అవ్వాల్సిందేనన్నారు. చంద్రబాబు తన అవినీతి మకిలిని పొత్తు పెట్టుకున్న పార్టీకి, నేతలకు అంటిస్తారని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబు ఎంత గగ్గోలు పెట్టినా ఆయనతో ఎవరూ కలవరని, జూన్‌ 2 నుంచి 8 వరకు నవనిర్మాణ దీక్షలు చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని, తన ప్రసంగాలతో ప్రజలకు సుత్తి కొట్టడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని యద్దేవా చేశారు. నవ నిర్మాణ దీక్ష ఎందుకు? అసలు రాజధానిలో ఏం నిర్మించారని ప్రశ్నించారు. విూరు సాధించిన అభివృద్ధి ఏంటి? ప్రజలను మభ్య పెట్టడానికే విూ నవ నిర్మాణ దీక్షలు. చంద్రబాబు నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో అబద్దాలపై అబద్దాలు చెప్పడం మాత్రమే అలవాటు అయిందంటూ’అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఇసుక, మట్టి, రాజధాని భూములను అమ్ముకున్నారని మండిపడ్డారు.  ఫ్యూచర్‌ గ్రూప్‌, రిలయన్స్‌ కలిసి చౌక ధర దుకాణాలకు సరుకులు అందిస్తాయని ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, ఫ్యూచర్‌ గ్రూప్‌ చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌లో వాటాలు కలిగి వుందన్నారు. ఇంకా పాలన చేయడానికి చంద్రబాబుకు ఏడాది సమయం ఉందని, కనీసం ఇప్పుడయినా ప్రజల కోసం చంద్రబాబు పనిచేస్తే మంచిదని అంబటి హితవు పలికారు. కులం పేరుతో అందరినీ విభజిస్తున్నారని, చివరకు దేవుడికి కూడా కులం ఆపాదిస్తారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.