ప్రభుత్వ నిధులతో పార్టీ సభలు పెడితే ఊరుకోం

– తిరుమలను చంద్రబాబు రాజకీయ వ్యవస్థగా మార్చాలని చూస్తున్నాడు
– అర్చకులను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిది
– చంద్రబాబుపై మండిపడ్డ బీజేపీ ఎంపీ జీవిఎల్‌ నరసింహారావు
న్యూఢిల్లీ, మే25(జ‌నంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోమని, నిధులు లేవంటూ విూ సొంత కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు ఎలా వాడతారని బీజేపీ ఎంపీ జీవిఎల్‌ నర్సింహారావు సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబును ప్రధానిని చేస్తామని ఏ ఒక్క నేతా ప్రతిపాదించలేదని అన్నారు. తుమ్మితే ఊడిపోయే పదవి అని అప్పట్లో ఆయనే ప్రధాని పదవికి దూరంగా ఉండి త్యాగం చేసినట్టు ఫోజులు కొడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ధర్మపోరాట సభలు పెట్టడం పట్ల జీవీఎల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర నిధులతో పార్టీ సభలు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తిరుమలను రాజకీయ వ్యవస్థగా మార్చాలని చూస్తున్నారని అన్నారు. అర్చకులను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అర్చకులను తొలగించినందుకు చంద్రబాబు చెంపలేసుకోవాలని డిమాండ్‌ చేశారు. తిరుమల శ్రీవారి ఆభరణాల మాయంపై విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు ఏమయ్యాయో వెల్లడించాలని జీవీఎల్‌ నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.