పవన్ నడుస్తున్నాడు
– అధికారంలోకిరాగానే సుజల స్రవంతి ప్రాజెక్టునిపూర్తి చేస్తాం
– వైసీపీ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్, నవంబర్15(జనంసాక్షి) : అధికార పార్టీ తెదేపా డైరెక్షన్‌లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడని, అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కులాలతో సంబంధం లేదంటూనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కులాల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. పవన్ కల్యాణ్ వైఎస్సార్‌ను ఎదిరించానని గొప్పలు చెప్పుకుంటున్న పవన్.. అప్పుడు రాజకీయాల్లో ఉన్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబులాగే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఖాళీగా ఉన్నప్పుడే వచ్చి విమర్శలు చేయడం కాదు ప్రజల తరపున పోరాడాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పోరాడారని అన్నారు. అలాంటి కార్యక్రమం పవన్ చేశారా అని ప్రశ్నించారు. జగన్‌పై హత్యాయత్న విషయంలో పవన్ చంద్రబాబులాగే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ డైరెక్షన్‌లో పవన్ నడుస్తున్నారని ఆరోపించారు. బాబూ.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇప్పుడు గుర్తొచ్చిందా, మహానేత వైఎస్సార్ మురణం తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎవరూ పట్టించుకోలేదని బొత్స ఆరోపించారు. నాలుగున్నరేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. వైఎస్సార్ హయంలో శంకుస్థాపన చేసిన సుజల స్రవంతి ఇంతవరకూ పూర్తిచేయలేదని విమర్శించారు. వైఎస్‌ఆర్ హయంలో 95శాతం పూర్తయిన తోటపల్లి ప్రాజెక్టును ఇప్పటి వరకూ 5శాతం కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. పెండింగ్ ప్రాజెక్టులను 17వేల కోట్ల రూపాయాలతో పూర్తి చేస్తామన్న చంద్రబాబు.. ఇప్పుడు రూ.52వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని మండిపడ్డారు. మూడు రెట్లు అధికంగా ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సుజల స్రవంతి ప్రాజెక్టుని పూర్తి చేస్తామని బోత్స హావిూ ఇచ్చారు.




