అనుమతిస్తే శాంతియుతం
ఇవ్వకపోతే చెప్పలేం, మా చేతిలో ఉండదు
పార్టీలో తీర్మానం చేసిన బాబు అసెంబ్లీలో ఎందుకు నోరు విప్పరు
చలో అసెంబ్లీ సందర్భంగా ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత
‘జనంసాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కోదండరామ్
హైదరాబాద్, జూన్ 12 (జనంసాక్షి) :
శాంతియుతంగానే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. నిరసన తెలపడం ప్రజల ప్రజాస్వామి హక్కు అని, ఈ మేరకే నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు వ్యక్త పరిచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. బుధవారం ఆయన ‘జనంసాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
జనంసాక్షి : చలో అసెంబ్లీకి ప్రభుత్వం అనుమతివ్వకపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు?
కోదండరామ్ : రాజ్యాంగ బద్ధంగా ప్రజలకు సంక్రమించిన హక్కుల్లో నిరసన తెలిపే హక్కు ఒకటి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో హక్కుల సాధన కోసం చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం సాధరణమే. కానీ టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఏ కార్యక్రమానికీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వ చర్య రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం.
జనంసాక్షి : ఇలాంటి పరిస్థితుల్లో చలో అసెంబ్లీ కార్యక్రమం ఎలా సాగుబోతుంది?
కోదండరామ్ : శాంతియుతంగానే అసెంబ్లీ ముందుకు వెళ్తాం. ప్రభుత్వం అనుమతిస్తే లక్షలాది మందితో నిరసన తెలుపుతాం. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే ఉద్యమం ఏ రూపు దాల్చుతుందో చెప్పలేం. లక్షలాదిగా తరలివచ్చే ప్రజలు ఏ చర్యలకు పాల్పడినా అందుకు ఎవరి బాధ్యత ఉండదు. పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అలాకాదని అనుమతి ఇస్తే శాంతియుతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం.
జనంసాక్షి : హైదరాబాద్‌కు వచ్చే అన్ని బస్సు, రైలు మార్గాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి అరెస్టులు, బైండోవర్లు చేస్తున్నారు కదా? దీనిపై మీ స్పందన?
కోదండరామ్ : ప్రభుత్వం తెలంగాణ కోసం పిలుపునిచ్చిన ప్రతి ఆందోళన కార్యక్రమం సందర్భంగా ఇలాంటి చర్యలకే పాల్పడుతోంది. తెలంగాణవాదులను అక్రమంగా నిర్బంధించి ఉద్యమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. మిలియన్ మార్చ్, సాగరహారం సందర్భంగానూ ఇలాగే అరెస్టులు, బైండోవర్ల పర్వం సాగించింది. వాటి ప్రభావం ఉద్యమంపై ఎంతమాత్రం పడలేదన్న విషయాన్ని గుర్తించాలి. ఎన్ని నిర్బంధాలు పెట్టినా, బైండోవర్లు సాగించినా చలో అసెంబ్లీని అడ్డుకోలేరు. లక్షలాదిగా తరలివచ్చేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.
జనంసాక్షి : అరెస్టులు, బైండోవర్లపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కనీసం స్పందించడం లేదు కదా?
కోదండరామ్ : తెలంగాణ ప్రజల ఓట్లతోనే ఎన్నికై అధికారం అనుభవిస్తున్నవారు ప్రజల ఆకాంక్షలపై స్పందించడం లేదు సరికదా, ఉద్యమకారులపై సాగుతున్న నిర్బంధాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇస్తామని ప్రకటించింది. ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఆ పార్టీ, ప్రభుత్వంపై ఉంది. పోలీసులు రోడ్లపై పికెట్లు ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు వస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వాములవుతున్న వారిని రాత్రికి రాత్రే బైండోవర్ల పేరుతో నిర్బంధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వీడిని ఖండిరచాలి. పోలీసులను నియంత్రించాలి. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని పరిపూర్తి చేయాలి.
జనంసాక్షి : పార్టీలో తెలంగాణపై తీర్మానం చేశామంటున్న టీడీపీ అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రశ్నించకపోవడాన్ని ఎలా చూడాలి?
కోదండరామ్ : తెలుగుదేశం పార్టీ ప్రత్యేక రాష్ట్రంపై తీర్మానం చేశామని చెప్పుకుంటోంది కానీ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ఈ విషయమై గొంతు విప్పడం లేదు. తెలంగాణపై తీర్మానం చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దీనిపై ఆ పార్టీ హామీనిచ్చింది. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాలి. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కూడా గొంతు కలిపితే డిమాండ్‌పై ప్రభుత్వం దిగివచ్చే అవకాశముంది.
జనంసాక్షి : బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్ఎస్ స్పీకర్‌ను కోరినప్పుడు చంద్రబాబు నవ్వి ఊరుకున్నాడు? అంటే ఆ పార్టీ చేసిన తీర్మానం ఉత్తదే అనుకోవాలా?
కోదండరామ్ : రాజకీయ పార్టీగా ప్రజలకిచ్చిన హామీని పరిపూర్తి చేయాల్సిన అవసరం టీడీపీపై ఉంది. అందుకు విరుద్ధంగా చంద్రబాబు బీఏసీలో ప్రవర్తించినట్లుగా విన్నాం. అది ఎంతమాత్రం సరికాదు. 2009 డిసెంబర్ 10 నాడు చంద్రబాబు ప్రవర్తనను ప్రజలింకా మరిచిపోలేదు. మళ్లీ అలాంటే ప్రయత్నాలే చేస్తే ఏం చేయాలో ప్రజలే చూసుకుంటారు.
జనంసాక్షి : తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు మిన్నకుండటంలో ఆంతర్యమేమిటీ?
కోదండరామ్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసి వెనక్కి వెళ్లింది. తర్వాతికాలంలో ఉద్యమం ఎగసి పడటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. కానీ పూర్తి స్థాయిలో ఫలితాన్నిచ్చే దిశగా సాగలేదనే చెప్పాలి. వీరిపై అధిష్టానానికి సరైన గౌరవం లేదన్నట్లుగా అనిపిస్తోంది. సీమాంధ్రులకు ఒక గౌరవం లభిస్తే తెలంగాణ నేతలను మరోలా చూస్తున్నారు. ఇప్పుడు చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతిచ్చే బాధ్యతను కాంగ్రెస్ నేతలే తీసుకోవాలి. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చే అనుమతినిప్పిస్తే అందరికీ మంచిది లేకుంటే జరగబోయే పరిణామాలకు ఆ పార్టీనే బాధ్యత వహించి తీరాలి.
జనంసాక్షి : ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, పోలీసులను ఏం డిమాండ్ చేస్తారు?
కోదండరామ్ : ప్రజల హక్కులను కాలరాయాలనే ప్రయత్నాలను ప్రభుత్వం, పోలీసులు విరమించుకుంటే మంచిది. ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎంత మందిని అరెస్టు చేసినా ఉద్యమం మాత్రం ఆగదు. నాలుగున్నర కోట్ల ప్రజల ప్రజాస్వామిక హక్కు కోసం మేం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అనుమతి ఇస్తే మంచిది. లేకుంటే జరుగబోయే పరిణామాలకు ఎవరిని నిందించినా ప్రయోజనం ఉండదు.
జనంసాక్షి : ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఏం పిలుపునిస్తారు?
కోదండరామ్ : చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రజలు లక్షలాదిగా తరలిరావాలి. ఎవరు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా శాంతియుతంగానే నిరసన తెలపాలి. తెలంగాణ సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఇది మంచి వేదిక. దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో బాగస్వాములు కావాలి.