రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 2.,(జనంసాక్షి). అకాల వర్షాలు వడగళ్ల వానతో పంట నష్టపోయిన అన్నదాతలు అధైర్య పడవద్దని ప్రభుత్వం భరోసాగా ఉంటుందని ఐటీ మున్సిపల్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు పదివేల రూపాయల పరిహారం అందజేస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో పలు మండలాల్లో క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పంట నష్టం పై పరిశీలన జరిపారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ స్వయంగా రైతు అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల కష్టాలు తెలుసని అన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన అన్నదాతల కష్టాలు పరిస్థితులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎంతో కలిసివేసేయని అన్నారు. ఐదు జిల్లాల్లో పరిస్థితిలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు అండగా నిలబడి రైతుబంధు రైతు బీమా తో పాటు సమృద్ధిగా జలవనరులను అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రస్తావించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 33 శాతం నుండి 50% వరకు వడగళ్ల వానకు దాన్యం చేలల్లోనే రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. 19 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారుల నివేదికలు తెలుపుతున్నాయని అన్నారు. తడిసిన ధాన్యం మొలకెత్తిన ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ తో మాట్లాడడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు భరోసాగా నిలుస్తూ ఎకరాకు పదివేల రూపాయల పరిహారాన్ని అందిస్తుందని అన్నారు. అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో టేస్కబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పవర్లూమ్ టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ జిదం కళ, భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి. తదితరులు పాల్గొన్నారు.




