Monday, 2 November 2026

అన్ని జిల్లాల్లో చేపల పెంపకం : తలసాని 

హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): దాదాపు అన్ని జిల్లాల్లో చేపపిల్లల పెంపకం చేపట్టామని, అన్ని చెరువులు, ప్రాజెక్టుల్లో చేపవిత్తనాలను వదిలామని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ చెప్పారు. దీంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారని అన్నారు. వరుసగా మూడోయేడు కూడా గతంలో ఎప్పుడూ
లేని విధంగా ఉచితంగా విత్తనాలను అందించిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యశాఖకు కేవలం రూ.కోటి మాత్రమే బడ్జెట్‌ ఉండేదని, తెలంగాణ రాష్ట్రంలో రూ.100 కోట్లకు ఆ బడ్జెట్‌ను పెంచామని మంత్రి  అన్నారు. తాను అన్ని జిల్లాల్లో పర్యటించి చేపల పెంపకాన్ని ప్రారంభించానని అన్నారు. మత్స్యకారులంతా సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారని అన్నారు.  రాష్ట్రంలో చేప పిల్లల అభివృద్ధి, మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు.చిన్న కుంటల్లోనూ చేపపిల్లల పెంపకానికి బడ్జెట్‌ పెంచాలని ముఖ్యమంత్రిని కోరతామన్నారు. బీసీల సంక్షేమానికి సీఎం కట్టుబడి ఉన్నారన్నారు. 119 బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు బీసీ కమిషన్‌ను సైతం ఏర్పాటు చేశామన్నారు. గీత కార్మికులకు రూ.5 లక్షలకు పరిహారం పెంచామని, వారి సొసైటీలను బలోపేతం చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో మరింత బడ్జెట్‌ కేటాయిస్తామని, అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.