
– బాలీవుడ్ నటులను వద్దనుకుంటున్న సర్కారు
దిల్లీ,నవంబర్ 6(జనంసాక్షి): అపూర్వ భారత్ ప్రచారకర్తగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియమితులయ్యారు. విదేశీయులను ఆకర్షించేందుకు మోదీనే సరైన వ్యక్తి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మనీశ్ శర్మ అభిప్రాయపడ్డారు. గతంలో మోదీ చేసిన ప్రసంగాలను ప్రకటనలుగా రూపొందించి ప్రసారం చేస్తామని వెల్లడించారు. అపూర్వ భారత్ ప్రచారకర్తగా ఇకపై బాలీవుడ్ నటులను నియమించరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.అపూర్వ భారత్ ప్రచారకర్తగా ఆమిర్‌ఖాన్ గడువు ముగిసిన తర్వాత ఆ స్థానంలో కేంద్రం మరొకరిని నియమించలేదు. అనంతరం అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రాల్లో ఎవరో ఒకరిని నియమించనున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే అపూర్వ భారత్ ప్రచారకర్తగా బాలీవుడ్ నటులను నియమించే విధానానికి తాజాగా కేంద్రం స్వస్తి పలికింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించే అంశంలో మోదీని మించిన వ్యక్తి దేశంలో ఎవరూ లేరని పర్యాటక శాఖ మంత్రి మనీశ్ శర్మ అభిప్రాయపడ్డారు. ప్రధానిగా మోదీ ఇప్పటివరకు పర్యటించిన దేశాల నుంచి పర్యాటకుల తాకిడి భారత్‌కు పెరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.




