Tuesday, 3 November 2026

మహిళ పట్ల వైద్యుడి అసభ్య ప్రవర్తన

– పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ
– వైద్యుడిని అరెస్ట్‌ చేసిన ఉప్పల్‌ పోలీసులు
హైదరాబాద్‌, మే4(జ‌నంసాక్షి): వైద్యుడు దేవుడితో సమానం అంటారు. ఎలాంటి రోగాన్ని అయినా మందుతో చిటికెలో నయం చేయగల వైద్యులను అమితంగా గౌరవిస్తారు. కానీ ఆ వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ఓ వైద్యుడు వ్యవహరించాడు. తలనొప్పి బాధిస్తోందన్న మహిళను లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు ప్రబుద్ధుడిని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఉప్పల్‌ పీఎస్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిలుకనగర్‌ బస్తీకి చెందిన ఓ మహిళకు గతకొంతకాలంగా తలనొప్పి వస్తోంది. ఎన్ని మందులు వాడినా నొప్పి తగ్గకపోవడంతో ఆమె బస్తీలో ఉన్న ఆసుపత్రికి వచ్చింది. అక్కడ డా.బాలరాజుకు తనబాధ చెప్పుకుంది. తలనొప్పికి తోడుగా తరచూ దగ్గుకూడా వస్తోందని చెప్పింది. అయితే రోగి అనారోగ్యానికి మందు ఇవ్వాల్సిన బాలరాజు.. కామాంధుడిగా మారిపోయాడు. తలనొప్పి తగ్గాలంటే మసాజ్‌ చేయాలంటూ ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం శరీరంపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అవాక్కయిన మహిళ వైద్యుడిని వారించింది.. వైద్యుడు ఆమెను బలవంతం చేయబోయే సరికి అక్కడి నుంచి ఒక్క ఉదుటున బయటపడింది. వైద్యుడి ప్రవర్తనను సదరు మహిళ కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని వివరించారు. మహిళల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు డా.బాలరాజును అరెస్టు చేసి ఉప్పల్‌ స్టేషన్‌కు తరలించారు.