అబద్దాల ప్రచారంలో చంద్రబాబు దిట్ట

పోలవరంపై అన్నీ అబద్దాల ప్రచారాలు: విజయసాయి

అమరావతి,జూన్‌12(జ‌నం సాక్షి ): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్క రోజులోనే 13 వేల క్యూబిక్‌ విూటర్ల పనులను చేశామని చంద్రబాబు అన్నారని… ఇదే విషయాన్ని తిరుమల వెంకన్న విూద ప్రమాణం చేసి చెప్పగలరా? అని వెసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అబద్ధపు ప్రచారాలతో తెలుగు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించడం చంద్రబాబుతో సాధ్యం కాదన్నారు. అది వైఎస్‌ఆర్‌ కల అని, తమ ప్రభుత్వం ఏర్పడితే పోలవరాన్ని నిర్మాణం పూర్తి చేస్తామని హావిూ ఇచ్చారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎపికి చంద్రబాబు ఓ దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అంటూ ఘాటు విమర్శలు చేశారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా గోబెల్స్‌ ప్రచారం చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని అన్నారు. తెలంగాణ టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులును తాను కలవాలని అనుకోలేదని… కానీ, చంద్రబాబు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను తప్పకుండా కలుస్తానని విజయసాయి చెప్పారు. ఒక దళిత నేతను కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. మోత్కుపల్లిని తాను కలిస్తే చంద్రబాబుకు భయం ఎందుకని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటి వరకు రూ.3లక్షల కోట్ల నల్లదనాన్ని విదేశాలకు తరలించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. దేవుని డబ్బు సైతం తండ్రి కొడుకులు కలిసి దోచుకుంటున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో చంద్రబాబు, లోకేశ్‌లు జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. అబద్దాలు చెప్పి బాబు అధికారంలోకి వచ్చారని, మరోసారి చంద్రబాబును ప్రజలు నమ్మబోరని వ్యాఖ్యానించారు.