అభివృద్దికి నంద్యాల ఫలితం నిదర్శనం
ఏలూరు,ఆగస్ట్29(జనంసాక్షి): రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ది పనుల ఫలితమే నంద్యాల విజయమని టిడిపి జిల్లా అధ్యక్షురాలు సీతామాలక్ష్మి అన్నారు. ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారే తప్ప రాజకీయాలను కాదన్నారు. విపక్ష వైకాపా నేతలు ఉచ్చనీచాలు మరచి విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాకినాడలో కూడా టిడిపిదే విజయం అన్నారు. ప్రతిపక్షాలు పట్టిసీమని ఎద్దేవా చేసినా నేడు అదే పట్టిసీమ డెల్టా రైతాంగానికి జీవనాధరామైందని అన్నారు. దేశంలోనే నదులను అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. గోదావరి జలాలను కృష్ణానదితో అనుసంధానం చేయడం వల్ల నేడు డెల్టా రైతాంగానికి లబ్ది చేకూరుతుందన్నారు. సాగుపై పూర్తిగా ఆశలు కోల్పోయిన డెల్టా రైతాంగానికి పట్టిసీమ ఊపిరి పోస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. కేంద్రం పెద్దన్నలాగా వ్యవహారించి రాష్టాల్ర మధ్య నీటి తగాదాలను పరిష్కరించాల్సిన అవసరంఉందన్నారు. లేకపోతే నీటి యుద్దాలు సంభవించే దుస్థితి ఎదురవుతుందని అన్నారు. నీటి వివాదాలను పరిష్కరించడానికి కేంద్రం ప్రత్యేక బోర్టును ఏర్పాటుచేయాలని కోరారు.
ప్రధానంగా పోలవరం వంటి ప్రాజెక్టు కోస్తాకు మాత్రమే కాదని, నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని 11 జిలాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఏవిధంగా పరోక్షంగా ప్రయోజనం కలుగుతుందో వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేయడానికి కేంద్రంపై తెలుగుదేశం ప్రభుత్వం తరుపున ఒత్తిడి తెస్తున్నట్లు ఎంపి పేర్కొన్నారు. సాగునీటిని రైతాంగానికి అందించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పురుషోత్తమపట్నం కూడా ఇందుకు ఉదాహరణ అన్నారు. నదుల అనుసంధానం ద్వారా డెల్టా రైతాంగానికి నీటిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి పట్టిసీమప్రాజెక్టును తీసుకు వస్తే, అప్పుడు ఎద్దేవా చేసిన వారే, ఇప్పుడు నోరుమూసు కున్నారన్నారు. యుద్దప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రకటించిన తేదిన నీరు విడుదల చేయడం, డెల్టారైతాంగం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ది తేటతెల్లం చేస్తుందన్నారు. డెల్టా ప్రాంతానికి పట్టిసిమ ప్రాజెక్టు వరప్రదాయనిగా పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమ ప్రాజెక్టును డిజైన్ చేసి డెల్టా రైతాంగానికి నీరు అందించడానికి చేసిన కృషి మరువలేనిదన్నారు. బాబుకు డెల్టా రైతాంగం రుణపడి ఉంటుందన్నారు.