హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల కుటుంబాల విషయంలో ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకున్నారు. అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దాంతోపాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను ఆదుకోవాలని, వాళ్లకు తగిన ఆర్థికసాయంతో పాటు ప్రభుత్వోద్యోగాలు కూడా ఇవ్వాలన్న డిమాండ్లు చాలాకాలంగా ఉన్నాయి. ఇంతకుముందు బడ్జెట్లో కూడా దీనికి కేటాయింపులు జరిగాయి. అయితే.. అప్పట్లో అమరవీరుల సంఖ్య మీద, వారికి ఇస్తామన్న మొత్తం మీద ఇంతకు ముందు పలు విమర్శలు, వివాదాలు తలెత్తాయి. దాంతో ఈ అంశాన్ని సమగ్రంగా సమీక్షించిన తర్వాత కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకుని, ప్రకటించారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, కలెక్టర్లు ఈ విషయాన్ని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. కుటుంబంలో ఎవరికి ఉద్యోగం కల్పించాలనే విషయాన్ని కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవాలని తెలిపారు.
ఒకవేళ అమరవీరుల కుటుంబ సభ్యులు తమలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం వద్దంటే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపుతామన్నారు. జాప్యం లేకుండా అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేస్తామన్నారు. మరోవైపు, బీడీ కార్మికులకు నెలకు రూ. వెయ్యి భృతి అందించేందుకు కార్యక్రమం మార్చి 1వ తేదీన ప్రారంభమవుతుందన్నారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి, మెదక్ జిల్లా దుబ్బాక, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. బీడీ కార్మికుల భృతి కోసం రూ. 40 కోట్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.





