Tuesday, 3 November 2026

అమరావతి నిర్మాణంలో..  టీడీపీ అక్రమాలకు పాల్పడుతుంది

– విదేశీ కంపెనీలకు వేలకోట్లు దోచిపెట్టే కుట్ర జరుగుతుంది
– భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
విజయవాడ, నవంబర్‌1(జ‌నంసాక్షి):  అమరావతి నిర్మాణంలో విదేశీ కంపెనీలకు వేల కోట్లు దోచిపెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతికి తొలుత డిజైన్లు రూపొందించిన మాకీ అసోసియేట్‌ను పక్కనపెట్టి వేరే సంస్థలకు అప్పగించటం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అమరావతి డిజైన్ల రూపకల్పనకు జెనిసెస్‌ ప్లానర్స్‌ అనే సంస్థకు 90కోట్లు ముట్టజెప్పేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో భాజపా చేస్తున్న నిరసనలపై తెదేపా నాయకులు విమర్శలు చేయటం సమంజసం కాదని కన్నా అన్నారు. న్యాయస్థానాలు సైతం ఈ విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుబట్టాయని గుర్తు చేశారు. మహిళల అక్రమ రవాణా, కాల్‌ మనీ వ్యవహారంలో రాష్ట్రం పరువు పోయిందన్నారు. పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన రూ.650కోట్ల పరిహారాన్ని తెదేపా నేతలు దోచుకున్నారని ఆరోపించారు. తిత్లీ తుపాను బాధితులకు కేంద్ర ప్రభుత్వం రూ.229కోట్లను విడుదల చేసి అండగా నిలిచిందని కన్నా అన్నారు.