ఆదిలాబాద్,ఫిబ్రవరి23(జనంసాక్షి): తెలంగాణ అమరవీరుల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతూ వారిని మోసం చేస్తోందని సిపిఐ విర్శించింది. అమరులు ఎంతమనేది ఇప్పటికీ నిర్ధారించలేదన్నారు. తెలంగాణ కోసం 1200 మంది యువకులు బలిదానాలు చేశారని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 420 మాత్రమే అమరులయ్యారని చెప్పడాన్ని సిపిఐ నేత గుండామల్లేశ్ తప్పుపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూల్లో ఒక్క దాన్నీ ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదన్నారు. బెల్లంపల్లిలో సిపిఐ సభల సందర్భంగా ఆయన విూడియాతోమాట్లాడుతూ కెసిఆర్ విధానాలను తప్పుపట్టారు. తెలంగాణలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వాటిని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.3 లక్షల నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటుంటే.. ఇక్కడి ప్రభుత్వం మౌన ముద్ర వీడటం లేదన్నారు. 2013 భూ సేకరణ చట్టానికి సవరణలు తీసుకువచ్చి రైతుల భూములను అప్పనంగా లాక్కునేందుకు చూస్తున్నారన్నారు.ఈ విషయాలన్నింటిపై మార్చిలో జరిగే రాష్ట్ర మహాసభల్లో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటామన్నారు. తన కూతురు, ఎంపీ కవితకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భాజపాతో స్నేహం చేస్తే ప్రజలు గట్టి బుద్ధిచెబుతారని అన్నారు. పేదలకు రెండు బెడ్‌రూములతో కూడిన పక్కా ఇంటిని కట్టిస్తానని హావిూలు గుప్పించిన తెరాస ప్రభుత్వం తొమ్మిది నెలల పాలనలో ఒక పక్కా ఇల్లు మంజూరు చేయలేదని ఆరోపించారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కోసం అన్ని పార్టీలు కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తు తగ్గిస్తే ఇబ్బందులు రావంటూ పేర్కొనడం విస్మయానికి గురి చేస్తుందన్నారు. ఇప్పటికే 16 లిప్టులు నిర్మించారని, ఎత్తు తగ్గిస్తే ఎలా నీళ్లు వస్తాయో ఆయన ప్రజలకు వివరించాల్సి ఉందన్నారు. వాస్తుదోషం పేరిట సచివాలయం తరలించి నూతన సచివాలయ నిర్మాణానికి రూ.150 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. ఫాస్ట్ పథకాన్ని రద్దు చేయడం ఆయన నిలకడలేని ఆలోచనలకు నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సందర్భంగా రజాకార్లు, నిజాం పాలనను విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు అందుకు భిన్నంగా నిజాం పాలనను పొగుడుతున్నారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లబ్ది కోసమే ఇలా మాట్లాడుతున్నారన్నారు. దేశ సహజ వనరులను కొల్లగొడుతున్న కార్పొరేట్ సంస్థల యాజమానులకు అండగా ఉంటూ మోడీ ప్రభుత్వం వారికి లొంగిపోయిందని ఆరోపించారు. ఎనిమిది నెలల దేశ ప్రధాని నరేంద్రమోడీ పాలనకు ఢిల్లీ ప్రజలు తాగిన గుణపాఠం చెప్పారన్నారు. మానవళి మనుగడకు సీపీఐ రాజీలేని పోరాటాలు చేస్తుందని, ప్రజలకు అండగా ఉంటుందన్నారు.




