ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనతో ఉత్తేజం
మజ్లిస్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రచారం
హైదారాబాద్,నవంబర్26(జనంసాక్షి): భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలు విజయవంతం కావడం, ప్రచారంలో ఆయన చేసిన విమర్శలతో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. నిర్మల్ నేలపైన అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. హిందూ దేవతలను అవమానపరిన గడ్డ ఇదేనని.. ఆ విషయంలో కేసీఆర్ చర్యలు తీసుకోలేక పోవడంపైన ఘాటుగా విమర్శలు చేశారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోకవర్గాల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటుచేసిన ఈ సభకు పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, అనుబంధ సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భారీగా ప్రజలు తరలి రావడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త సంబరం కనిపించింది. అమిత్‌షా ప్రసంగం ఆద్యంతం పార్టీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, తెరాసలకు అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు ఈ సారి భాజపాకు అవకాశం ఇవ్వాలని, దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హావిూ ఇచ్చారు. ఇందుకోసం విజయ సంకల్పం తీసుకోవాలని
సూచించినపుడు ప్రజలంతా చేతులెత్తి స్పందన తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని రాహుల్బాబాగా పేర్కొంటూ చేసిన విమర్శలతో నవ్వులు విరబూశాయి. తక్కువ సమయమే మాట్లాడినప్పటికీ అన్ని వివరాలను సూటిగా, స్పష్టంగా వ్యక్తం చేయడం అందరినీ ఆకట్టుకుంది. భాజపా అధినేత సభ విజయవంతం కావడం పార్టీ శ్రేణుల్లో నూతనొత్తేజం నింపింది.కార్యకర్తలను ఉత్తేజ పర్చేందుకు పార్టీ ప్రాధాన్యాన్ని వివరిస్తూ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలు సభికుల ప్రశంసలు అందుకున్నాయి. ఆయన ప్రసంగం తెరాస, కాంగ్రెస్, తెదేపాలను లక్ష్యంగా చేసుకుని సాగింది. ఆ పార్టీలు ఇప్పటివరకు అవలంబించిన విధానాలను విమర్శిస్తూ భాజపా మాత్రమే ప్రత్యామ్నాయమంటూ సభికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎంఐఎం పార్టీకి తెరాస అధినేత కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఆ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని దుయ్యబట్టారు. పరిశ్రమలు ఏర్పడకపోవడానికి నిరుద్యోగులకు ఉపాధి లభించకపోవడానికి తెదేపా, కాంగ్రెస్, తెరాస పార్టీలే ప్రధాన కారణమని ఇక్కడి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. హిందూ దేవతలను అవమానించిన అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేసినప్పటికీ, మజ్లిస్‌కు భయపడి నీరుగార్చిన విషయాన్ని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్, తెరాస, తెదేపా, కమ్యూనిస్టులకు మజ్లిస్‌ను ఎదుర్కొనే ధైర్యం లేదని.. అది కేవలం భాజపాకే ఉందని చెప్పినపుడు ప్రజలు పెద్దఎత్తున కేరింతలు కొట్టారు. తెలంగాణ అమరవీరులను స్మరించుకోవాలా వద్దా అని ప్రశ్నిస్తూ ప్రజల నుంచి సమాధానం రాబట్టేందుకు ప్రయత్నించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేది భాజపా మాత్రమేనని, ఏ పార్టీ ఆ ధైర్యం చేయదని చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుతున్నాడని, వారికి రిజర్వేషన్లు కల్పించాలా అని ప్రశ్నించారు. భాజపా అధికారంలో ఉన్నంత కాలం ఎన్ని పార్టీలు కలిసివచ్చినా మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించే ప్రసక్తిలేదని స్పష్టం చేసారు.తెరాస గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోకపోవడాన్ని వివరించారు. అయిదేళ్లలో 4500 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని .. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హావిూ నెరవేరకపోవడాన్ని ప్రస్తావించడంతోపాటు.. మిషన్ భగీరథ పనులు పూర్తికాకుండా ఓట్లు ఎలా అడుగుతారని కేసీఆర్‌పైన అమిత్ షా ప్రశ్నల వర్షం కురిపించడంతో ప్రజలను ఆలోచింపచేసింది.




