అరకు జంటహత్యపై సిఎంకు నివేదిక
అందచేసిన డిజిపి ఠాకూర్
అమరావతి,అక్టోబర్2(జనంసాక్షి): అరకు జంటహత్యల ఘటనపై సీఎం చంద్రబాబుకు ప్రాథమిక నివేదిక అందింది. మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రిని కలసిన డీజీపీ ఠాకూర్.. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోము హత్యకు సంబంధించిన రిపోర్టును అందజేశారు. ఆ నివేదికలో ఆరుగురు పేర్లు ఉన్నట్లు సమాచారం. వారంతా టీడీపీతోపాటు వైసీపీ, బహుజన్ సమాజ్ పార్టీ నేతలుగా పోలీసులు గుర్తించారు. ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత నెలలో మావోయిస్టులు మూడు పర్యాయాలు వచ్చిన సమయంలో వారికి ఆశ్రయం ఇచ్చినట్లు విచారణలో తేలింది. వారిని మావోయిస్టులు బెదిరించి ఆశ్రయం పొందారా? లేక ఎటువంటి పరిస్థితుల్లో వారు ఆశ్రయం ఇచ్చారన్న అంశంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అయితే కిడారి, సోమలను మావోయిస్టులు హెచ్చరించి వదిలిపెడతారని అనుకున్నామని, కాల్చి చంపుతారని తాము భావించలేదని ఆరుగురు పోలీసులకు చెప్పినట్లు తెలియవచ్చింది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో కొత్త సంగతులు బయట పడుతున్నాయి. మావోయిజం, స్థానిక రాజకీయం కలగలిసి ఆయనను బలితీసుకున్నట్లు స్పష్టమవుతోంది. మావోయిస్టులు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చి చంపడం… తర్వాత పోలీసు స్టేషన్లపై స్థానికుల దాడితో అరకు అట్టుడికిపోయింది. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కిడారి హత్యకు ఆరుగురు స్థానిక నేతలు సహకరించగా… వీరిలో ముగ్గురికి టీడీపీ, ఇద్దరికి వైసీపీ, ఒకరికి బీఎస్పీతో సంబంధాలున్నట్లు చెబుతున్నారు.