శరవేగంగా కాళేశ్వరం నిర్మాణం పూర్తి
కోనసీమను తలపించేలా నీటిపారకం
హైదరాబాద్,జూన్1(జనంసాక్షి): కోటి ఎకరాల మాగాణమే ప్రధాన లక్ష్యంగా రూపొందించిన ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతున్న వేళ తెలంగాణ మరో కోనసీమ కావడానికి ఇంకెంతో దూరం లేదు. గలగలా పారే నీటితో పచ్చని పొలాలు తెలంగాణలో దర్శనమివ్వబోతున్నాయి. తెలంగాణ సర్కారు చిత్తశుద్ధి, ప్రధానంగా సీఎం కేసీఆర్ సంకల్పం, అలుపెరగని శ్రమ కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. కాళేశ్వరం.. పాలమూరు`రంగారెడ్డి.. డిరడి ఎత్తిపోతల..లోయర్ పెనుగంగ.. వంటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి కావస్తున్నాయి. రాష్ట్రంలోని పద్నాలుగు జిల్లాల ముఖచిత్రాన్ని మార్చే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అందుబాటులోకి రావడం అనిర్వచనీయంగా కనిపిస్తున్నది. ఎనిమిదేళ్ల ప్రస్థానంలో ఈ ప్రాజెక్టులన్నీ మైలురాళ్లుగానే చెప్పుకోవాలి. గోదావరి తల్లి సైతం ముచ్చటపడేలా రూపుదిద్దుకుంటున్న బరాజ్‌లు.. ఎప్పుడు గోదావరిజలాలు ఎత్తిపోయాలా అనే ఉత్సుకతతో సాగుతున్న పంపుహౌస్‌ల నిర్మాణంతో కాళేశ్వరం అనేక రికార్డులను సొంతం చేసుకుంది.రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో పాలనాపరమైన ఇబ్బందులు, సాగునీటి ప్రాజెక్టులపరంగా సమైక్య పాలన నుంచి వారసత్వంగా వచ్చిన చిక్కులు.. కొన్ని నెలలపాటు సాగునీటిరంగం నెమ్మదిగా అడుగులు వేసింది. కానీ ఆ తర్వాత ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల
పూర్తిపై ప్రత్యేక దృష్టిసారిస్తూనే, దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేపట్టనిరీతిలో సీఎం కేసీఆర్ ఒక ఇంజినీర్లా సాగునీటి ప్రాజెక్టులను రీడిజైనింగ్ను చేయించి ముందుకు సాగడంతో అవన్నీసాకారం అవుతున్నాయి. దేశంలో అన్ని రాష్టాల్ర కంటే ఎక్కువగా సాగునీటిరంగానికి పెద్దపీట వేసిన తెలంగాణ సర్కారు.. కోటి ఎకరాల మాగాణం కోసంచేస్తున్న భగీరథయత్నం యావత్తు భారతదేశాన్ని అబ్బుర పరుస్తున్నది. ప్రాజెక్టులంటే దశాబ్దాల తరబడి సాగేవనే విధానానికి చరమగీతం పాడి, నిర్మాణరంగంలో ప్రపంచ రికార్డులను తిరుగరాసేలా రేయింబవళ్లు భారీయంత్రాలతో జోరుగా సాగుతున్న పనులతో గొప్ప సాగునీటి విప్లవం దిశగా తెలంగాణ భూమిని పచ్చగా మార్చబోతున్నాయి. ప్రధానంగా ఈ వర్షాకాలం నుంచి బీడు భూముల్లో జలసిరులు కురవనున్నాయి.అన్ని ప్రాజెక్టుల్లో కాంక్రీట్, కాల్వలు, డిస్టిబ్యూట్రరీల నిర్మాణంలోనూ జరుగుతున్న పనుల వేగాన్ని తెలంగాణ సమాజం ఇప్పటివరకు ఏనాడూ చూసి ఎరుగదు. అందుకే తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రూపొందించిన రీడిజైనింగ్.. నెలల వ్యవధిలోనే క్షేత్రస్థాయిలో పనుల రూపంలోకి వచ్చింది. జెట్ స్పీడ్‌తో జరుగుతున్న పనులతో ప్రాజెక్టులు సాకారం కావడమన్నది తెలంగాణ ప్రభుత్వ పట్టుదలకు నిదర్శనం.
అలుపెరగని శ్రమ కోటి ఎకరాల మాగాణం లక్ష్యంగా ప్రాజెక్టులు




