ఎనిమిదేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు
రైతుబంధుతో అన్నదాతలకు భరోసా
వ్యవసాయరంగ పురోగతికి వినూత్నంగా చర్యలు
హైదరాబాద్,జూన్1(జనంసాక్షి): నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్న నినాదంతో ముందుకు సాగుతూ అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, వాటిని శరవేగంగా ఓ వైపు పూర్తి చేయిస్తూనే ..మరో వైపు రైతుల కోసం చేపట్టిన రైతుబంధు పథకం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయేలా కెసిఆర్ చేశారు. తెలంగాణ ఆవిర్భావం తరవాత ఇదో అద్భుత పథకంగా, కేంద్రం కూడా అనుసరించేలా చేసింది. అందుకే ఎవరు కూడా దీనిని విమర్శించడానికి ఆస్కారం లేకుండా అమలు చేశారు. రైతన్నలను ఏ విధంగా ఆదుకోవచ్చో ప్రపంచానికి తెలిపేలా చేస్తున్న కార్యక్రమాలు తెలంగాణ చరిత్రను కొత్తగా లిఖించాయి. కొందరు కారణ జన్ములు ఉంటారు. ప్రజల కోసం నిరంతరం తపించే పాలకులు పుడుతారు. మనం పాలన చేసేది ప్రజలకోసమే అన్న ఆలోచనతో ముందుకు సాగుతారు. అందుకు అనుగుణంగా ఆలోచన చేస్తారు. తమ ఆలోచనలు కార్యారూపం దాల్చేలా చేస్తారు. తన ఆలోచనలనకు పదనుపెట్టి ముందుకు నడిచి దానిని సాకారాం చేసిన క్రమంలో తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్దికి బాటలు వేస్తున్న తరుణంలో కెసిఆర్ మదిలో పుట్టిన ఆలోచనే రైతుబంధు పథకం. తెలంగాణ కల సాకారం అవుతుందని ఎవరు కూడా ఊహించలేదు. కానీ దానిని సాకారాం చేయడమే గాకుండా ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉండి తెలంగాణ సమస్యలపై యుద్దభేరి మోగించిన సిఎం కెసిఆర్ ఒక్కో సమస్యను కొలిక్కి తీసుకుని వస్తున్నారు. జనాభాలో 70శాతం ఉన్న రైతన్నల కష్టాలు తెలిసిన నాయకుడిగా ఎనిమిదేళ్లుగా చేస్తున్న ఆలోచనలు, కార్యక్రమాలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్న వేళ తెలంగాణ చరిత్రలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఎవరి ఊహలకు కూడా తట్టని విధంగా రైతులకు పెట్టబడి పథకం రైతుబందు పథకాన్ని ప్రకటించడం, వేలాదిగా రైతులకు చెక్కులను పంపిణీ చేయడం..వారు డబ్బులను డ్రా చేసుకోవడం ఏటా చకచకా సాగిపోతోంది. ఇది కలా నిజమా అన్న తీరులో కార్యక్రమాన్ని అంతా కృష్ణపరమాత్మ నడిపించి నంత సులువుగా సాగించారు. మనకింత అన్నం పెడుతున్న అన్నదాత
భుజం తడితే చాలు.. ఇంకా కష్టపడతాడు.. కాయకష్టం చేసి కనీస మద్దతు దరకోసం చూస్తున్న రైతులకు పెట్టుబడి సాయం ఎంతోకొంత అందితే అంతకన్నా కావాల్సిందేముంది. ఇప్పుడదే జరుగుతోంది. దీనిని కాపీ కొట్టిన మోడీ కిసాన్ సమ్మాన్ నిధిని అమలు చేస్తున్నారు. రైతును వెన్నుతట్టి ముందుకు నడిపించే మహానాయకుడొకడు తెలంగాణలో కెసిఆర్ రూపంలో వచ్చాడని రైతులంతా మొక్కుకుంటున్నారు. రైతు సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చిన సీఎం కేసీఆర్.. దేశ వ్యవసాయరంగ చరిత్రలోనే పెను సంచలనమైన రైతుబంధు పథకాన్ని ప్రకటించారు. సాగుపెట్టుబడి కోసం రైతుకు నేరుగా ఎకరానికి రూ.5వేలు ఇస్తామని ప్రకటించగానే యావత్ దేశం దృష్టి ఇటువైపు మళ్ళింది. దేశ రైతాంగం సంబుర పడిపోతే.. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్టాల్ర ముఖ్యమంత్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదెలా సాధ్యమంటూ తెలంగాణవైపు దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం పంట పెట్టుబడి కోసం ప్రతి రైతుకు సకాలంలో ఎకరాకు రూ.5వేల సాయం కచ్చితంగా అందిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు పలు కీలక నిర్ణయాలు ఇప్పుడు ఇతరులకు ఆదర్శం కాబోతున్నాయి. మాక్కూడా అమలు చేయాలని కౌలు రైతులు తదితరులు అడుగుతున్నారే తప్ప విమర్శించడం లేదు. అమల్లోకి వచ్చిన ఈ పథకం నిరాఘాటంగా ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పటికే మిషన్ కాతీయతో చెరువుల పునరుద్దరణ అన్న మహాయజ్ఞం నడుస్తోంది. దీంతో ఎప్పుడూ లేని విధంగా వేలది చెరువులు మళ్లీ జలకళ సంతరించు కున్నాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు రాబోతున్నది. ఇకపోతే నిరంతర విద్యుత్‌తో అటు ప్రజలను, ఇటు రైతులను ఆశ్చార్యానికి గురి చేశారు. అలాగే ప్రాజెక్టులను శరవేగంగా నడిపిస్తూ కృష్ణా,గోదావరి నదులను తెలంగాణ భూములకు చేరేలా చేస్తున్నారు. ఈ దశలో రైతులకు అండగా వారి వ్యవసాయంలో సాయం చేసే పథకం ఆవిష్కృతం కాబోతున్నది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా చూడాలన్న కల సాకారం దిశగా ఈ నాలుగేండ్లలో సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటూ ముందుకుసాగుతున్న తీరు అందరినీ అధ్యయనం చేసేలా చేస్తోంది. తొలుత మిషన్ కాకతీయ పథకంతో చెరువుల్లో పూడిక తీయించి భూగర్భ జలాల స్థిరీకరణపై దృష్టిపెట్టారు. బోర్లకింద ఎక్కువ సాగు భూమి ఉన్నందున రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తున్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు. యాంత్రీకరణకు పెద్దపీట వేస్తూ ఆధునిక వ్యవసాయం వైపు మళ్లించారు. గోదాంల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టారు. బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ యాంత్రీకరణకు నిధులను ఏటా పెంచుతూ వస్తున్నారు. అడ్డగోలు ఎరువుల వినియోగాన్ని తగ్గించడంతోపాటు రైతు పొలానికి ఏ పోషకాలు ఎంత అవసరమో తెలియజేసే అత్యంత ముఖ్యమైన భూసార పరీక్ష కార్డుల పంపిణీపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. భూసార పరీక్షలు చేయించి రైతులకు భూసార పరీక్ష ఫలితాల కార్డులను అందజేసే కార్యక్రమం కొనసాగుతున్నది. రాష్ట్ర వ్యవసాయరంగంలో స్వర్ణయుగానికి బాటలు వేస్తున్న రైతుబాంధవుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనడంలో సందేహం లేదు.