అవినీతి మయంగా తెదేపా పాలన
– మట్టి తవ్వి తీయడానికి రూ.13 వేల కోట్ల ఖర్చా?
– పాఠశాలలకు సున్నం వేయడానికి రూ.120కోట్లు
– భారీ కుంభకోణాలకు పాల్పడ్డుతున్నారు
– అవినీతి చంద్రబాబు విషయంలో గవర్నర్ ఏం చేస్తున్నారు?
– తక్షణమే చంద్రబాబును భర్తరఫ్ చేసే అంశాన్ని పరిశీలించాలి
– విలేకరుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
కాకినాడ, ఆగస్టు3(జనం సాక్షి) : రాష్ట్రంలో తెదేపా పాలన అవినీతి మయంగా మారిందని, తెదేపా కార్యకర్తలు అందిన కాడికి దోచుకుంటూ ప్రజాసొమ్మును దోచుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నీరు – చెట్టు కార్యక్రమంలో భాగంగా మట్టి తవ్వి తీయడానికి రూ.13600 కోట్లు ఖర్చు చేశారా అంటూ అశ్చర్యం వ్యక్తం చేశారు. తవ్విన మట్టిని కూడా టీడీపీ నాయకులు అమ్మేసుకున్నారని విమర్శించారు. చంద్రబాబూ నిన్ను పంచభూతాలు గమనిస్తున్నాయి.. జాగ్రత్త అని హెచ్చరించారు. పాఠశాలలకు సున్నం వేయడానికి మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే.. ఏకంగా రూ.120 కోట్లు మింగేశారని ఆరోపించారు. ఇదో భారీ కుంభకోణమని వ్యాఖ్యానించారు. స్కూలు యూనిఫారాల టెండర్ రూ.250 కోట్లకు మరో వ్యక్తికి కట్టబెట్టారని, ఇదో కుంభకోణం అని అవినీతి ఆరోపణలు గుప్పించారు. అవినీతి సీఎం చంద్రబాబు విషయంలో గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ఆలయాల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబును బర్తరఫ్ చేసే అంశాన్ని పరిశీలించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.