అవినీతి రహిత తెలంగాణే లక్ష్యమని, అవినీతిపై యుద్ధం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతే రాజుగా తమ పాలన ఉంటుందన్నారు. కల్తీ విత్తనాలు అమ్మే వారిపై ఉక్కుపాదం మోపుతాం, కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ 16వ ప్లీనరీ ముగింపు ఉపన్యాసంలో ముఖ్యమంత్రి పలు విషయాలు ప్రస్తావించారు. కల్తీ విత్తనాల వల్ల రైతు ఎంత నష్టపోయిండో.. అంత మొత్తం ఆ కంపెనీ చెల్లించే విధంగా చట్టం కూడా తీసుకుని వస్తామని ప్రకటించారు. వరంగల్ సభ అయిపోయిన తర్వాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి కల్తీ విత్తనాలపై చర్చిస్తామని చెప్పారు. ఇప్పటికే కల్తీ విత్తనాలు అమ్మిన నలుగురిపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ పెట్టారని తెలిపారు. ఆ నలుగురు ఇప్పుడు జైల్లో ఉన్నారని, ఎవరూ కల్తీ విత్తనాలను అమ్మి రైతులను చెడగొట్టొద్దని సూచించారు.
ప్రైవేటు ఆస్పత్రులు చేసే రాక్షసత్వం విషయంలో, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు సతాయించే ఫీజుల విషయంలో కూడా మంత్రిమండలి ఆలోచించి చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లలు డిగ్రీ చదువుకోవాలంటే పట్టణాల్లో వారికి అద్దెకు రూమ్‌లు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంలో తక్షణమే స్పందించి ఎస్సీ, ఎస్టీ అమ్మాయిల ఉన్నత విద్య కోసం 30 రెసిడెన్షియల్ కళాశాలలు స్థాపించడం జరిగిందని తెలిపారు. దీంతో ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. గిరిజన విద్యార్థినులకు కూడా గురుకుల కళాశాలలు స్థాపించబోతున్నామని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా మంచి పద్ధతితో ముందుకు పోతున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో రాజకీయ నాయకత్వం రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండి కొట్టిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో.. ఇసుకపై రూ. 20 కోట్లు వచ్చిన ఆదాయం మరుసటి ఏడాదికి రూ. 10 కోట్లకు, ఆ మరుసటి ఏడాదికి రూ. 5 కోట్లకు పడిపోయిందని వివరించారు. కాంగ్రెస్ పాలన ముగిసే నాటికి అది కాస్త రూ. 5 లక్షలకు పడిపోయిందని గుర్తుచేశారు. వారి పాలనలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని నాయకులు ఎలా తిన్నారో అర్థం అవుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక సీనరేజ్ కింద ఈ ఏడాది రూ. 460 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. రూ. 5 లక్షల ఆదాయం నుంచి రూ. 460 కోట్లకు ఆదాయం చేరిందంటే.. ఎవరి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రతి పనిలో విజయం ఉంటుందన్నారు.
టీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పనిచేసే పార్టీ కనుక అవినీతి రహిత తెలంగాణ కోసం పాటుపడుతున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తమ పాలనలో అవినీతికి చోటు లేదన్నారు. అవినీతి మీద యుద్ధం చేస్తున్నామని, అవినీతి రహితంగా పని చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ శాఖల మీద నిరాధార ఆరోపణలు చేస్తే.. చేసిన వారిపై కేసులు పెట్టాలని సంబంధిత మంత్రులకు సూచించారు. 100 శాతం రాష్ర్ట ప్రజల మనోభిష్టం మేరకు ప్రభుత్వం పాలనను సాగిస్తున్నదని ఉద్ఘాటించారు. భవిష్యత్ లో సంక్షేమ పథకాల అమలుపై మంత్రివర్గంతో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తనను మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్ సభను ముగించారు.




