అశోక్‌బాబుపై విమర్శలు సరికాదు: నటుడు శివాజీ

విజయవాడ,మే9(జ‌నం సాక్షి): ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌ బాబు ఎన్నికల ప్రచారాన్ని రాద్దాంతం చేయడం సరికాదని నటుడు శివాజీ అన్నారు.  అశోక్‌బాబు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొంటారని ప్రశ్నిస్తూ భారత ఎన్నికల సంఘానికి బిజెపి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ప్రత్యేక హౌదా సాధన సమితి నేత, సినీనటుడు శివాజీ.. అశోక్‌ బాబుపై బిజెపి నేతల తీరు బాగోలేదని అన్నారు. విజయవాడలో ఎపి ఎన్జీవోలకు మద్దతు తెలిపి, మాట్లాడారు. అశోక్‌ బాబుపై చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన సమైక్యాంధ్ర కోసం కూడా పోరాడారు. అశోక్‌ బాబునే కాదు.. మమ్మల్ని కూడా అలాగే విమర్శిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు దొరకట్లేవు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి ఇలా విమర్శలు చేస్తున్నామని మమ్మల్ని అంటున్నారు. ఇలాంటి విమర్శలు చేసేవారు తమ ఆలోచనమానుకోవాలని అన్నారు. 

తాజావార్తలు