ఆకాశానంటుతున్నాఎండుమిర్చి

p8ag3gcmఎండు మిర్చి ధరలు ఆకాశానంటుతున్నాయి. ఖమ్మం జిల్లా మిర్చి మార్కెట్ లో క్వింటాల్ ఎండు మిర్చి ఏకంగా 12 వేలు పలుకుతున్నది. రైతులు అమ్ముకున్నపుడు క్వింటా ఆరు వేలుండగా.. ఇప్పుడు పన్నెండు వేలకు ధర పెరిగింది. దీంతో వ్యాపారులకు లాభం.. రైతులకు మాత్రం నిరాశ మిగిల్చింది. తెలంగాణలోనే మిర్చి పంటలో ఖమ్మంది నెంబర్ వన్ స్థానం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 35 వేల హెక్టార్లల్లో మిర్చి సాగు చేస్తరు. మొన్నటి సీజన్ లో ఖమ్మం మార్కెట్ లో మిర్చి టర్నోవర్ 1500 కోట్లు నడిచింది. రైతులు అమ్ముకున్నపుడు 6 వేలు, సీజన్ ఎండింగ్ లో 10 వేల వరకు ధర పలికింది.

ఖమ్మం జిల్లాలో ఇపుడు మిర్చి రైతులు తలలు పట్టుకుంటుంటే, వ్యాపారులు మాత్రం పండుగ చేసుకుంటున్నరు. దీనికి కారణం విదేశీ ఆర్డర్లతో మిర్చి క్వింటాల్ 12 వేలు పలుకుతుండటం. దాంతో రైతుల వద్ద కొని కోల్డ్ స్టోరేజ్ లో దాచుకున్న వ్యాపారులకు లాభాల పంట పండుతోంది. నాలుగైదు నెలల తేడాలోనే మిర్చి రేట్ డబుల్ అయ్యే సరికి రైతులకు 1500 కోట్లు నష్టపోతే, ఆ లాభం వ్యాపారుల జేబుల్లోకి చేరుతున్నది. వేసవిలో మిర్చి అమ్ముకున్న రైతే తన పంటను నిల్వచేసి ఉంటే ఇపుడు లాభాలు వచ్చేవి. కానీ ఇప్పుడు రైతుల వద్ద మిర్చి లేదు. ఉన్నదంతా వ్యాపారుల చేతుల్లో కోల్డ్ స్టోరేజ్ లో నిల్వఉంది. ఒకటో అరో… నిల్వ చేసుకున్న పెద్ద రైతులు ఇప్పుడు సంతోషంలో ఉన్నారు .

నాలుగైదు నెలల తేడాలోనే ధర రెట్టింపు కావడంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు ఆ ఫలితం దక్కకుండా పోయింది. రైతులు పంటను నిల్వచేసుకోవాలనే చైతన్యం ఉంటే ఇప్పుడు మిర్చి బంగారం కురిపించేది. ఎకరా పొలంలో 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసినా… ఈ ధరల ప్రకారం మూడున్నర లక్షల ఆదాయం వచ్చేది. అందులో సగం ఖర్చు పోయినా.. లక్షన్నర రూపాయలు మిగిలేది. దీంతో రైతన్నలకు సిరులు కురిసేవి. కానీ సీజన్ అయిపోయాక మిర్చి ధర అమాంతం పెరగడంతో ఇప్పుడాలాభం లేకుండా పోయింది. విదేశీ ఆర్డర్ల తో మిర్చి కింటా 12 వేలకు ధర పెరిగే సరికి వ్యాపారులకు లాభం వస్తోంది. మొత్తం మీద మిర్చిపంట రైతులకు నిరాశ మిగిల్చగా.. వ్యాపారులకు మాత్రం లక్షల్లో లాభాలు తెచ్చిపెట్టింది.