– పర్యావరణ రక్షణ ప్రతి పౌరుడి విధి
– పోలీస్‌శాఖ తరపున అటవీశాఖకు సహాయసహకారాలందిస్తాం
– డీజీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్, జులై17(జనం సాక్షి) : అటవీ భూముల ఆక్రమణదారులు, వేటగాళ్లపై పీడీ చట్టం కింద కేసులు పెడతామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీసులు, అటవీశాఖల మధ్య మంగళవారం సమన్వయ సమావేశం జరిగింది. భేటీలో అటవీ భూములు, వన్యప్రాణుల రక్షణ, వేట నియంత్రణపై ఉన్నతాధికారులు చర్చించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, అటవీశాఖ ఉన్నతాధికారుల వీడియో సవిూక్ష సమావేశంలో పాల్గొన్నారు. సవిూక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అటవీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అటవీ భూమిని కాపాడటం, పర్యావరణ రక్షణ ప్రతి పౌరుడి ప్రథమ విధి అన్నారు. పట్టా భూములు కాకుండా ఆక్రమణలను కచ్చితంగాఅడ్డుకోవాల్సిందేనన్నారు. పోలీస్‌శాఖ తరపున అటవీశాఖకు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. నాలుగో విడత హరితహారంలో పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, అటవీశాఖలు ఆక్రమణలను అరికట్టాలని చెప్పారు. ఆక్రమణలకు గురైన అటవీ భూములను గూగుల్ మ్యాప్‌లతో ప్రచారం చేయాలని సూచించారు. అటవీ భూముల ఆక్రమణలపై స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. పోలీసు ఇంటలిజెన్స్ వ్యవస్థను ఆక్రమణలు, వేట వ్యవహారాల గుర్తింపునకు ఉపయోగిస్తామన్నారు. ఆక్రమణల్లో పాల్గొంటున్న కూలీలపై చర్యలు కాకుండా అసలు నిందితులను గుర్తించాలని పేర్కొన్నారు.




